మార్కెట్ యార్డుల్లో డిజిటల్ వసూళ్లు
వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్టుల వద్ద డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం
నగదు వసూళ్లకు బదులుగా ఇకపై ఈ-పాస్ యంత్రాల ద్వారా డిజిటల్ రసీదులు
రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు
పెరవలి చెక్ పోస్ట్ వద్ద డిజిటల్ విధానం ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి.ప్రశాంతి
ఎస్బీఐ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రాజెక్టు అమలు..డిజిటల్ వసూళ్లతో ఆదాయంలో పారదర్శకత, పెరుగుదలకు ఆస్కారం
ఈ విధానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన కలెక్టర్ పి. ప్రశాంతిని, జిల్లా అధికార యంత్రాంగాన్ని అభినందించిన మంత్రి దుర్గేష్
ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంతో మార్కెట్ యార్డుల ఆదాయానికి గండి పడకుండా రుసుం లక్ష్యాలను వంద శాతం చేరుకునేందుకు వీలుంటుందని తెలిపిన జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి
తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు: వ్యవసాయ మార్కెట్ కమిటీల చెక్ పోస్టుల వద్ద అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విధానంలో మార్కెట్ ఫీజులు వసూలు చేసే దిశగా పటిష్ట చర్యలు చేపట్టింది. తద్వారా మార్కెట్ రుసుం వంద శాతం సాధించేలా ఎస్బీఐ బ్యాంకు సహకారంతో అమలు చేస్తున్న ఈ పైలట్ ప్రాజెక్టును తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పెరవలి మండలం చెక్ పోస్టు వద్ద రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఐ.ఏ.ఎస్ లు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ-పాస్ యంత్రం ద్వారా డిజిటల్ చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డు తనిఖీల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మార్కెటింగ్ తనిఖీ కేంద్రాల వద్ద నగదు రూపంలో వసూలు చేయబడుతున్న మార్కెట్ ఫీజును పక్కనబెట్టి ఇకపై పూర్తిగా డిజిటల్ విధానంలో, తగిన రసీదుతోనే వసూలు చేయనున్నామన్నారు. తద్వారా పారదర్శకత పెరగడంతో పాటు మార్కెట్ కమిటీల ఆదాయం కూడా పెరగనుందని కూటమి ప్రభుత్వం విశ్వసిస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆలోచన, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విధానం, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రోత్సాహంతో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. డబ్బులు పక్కదారి పట్టకుండా కూటమి ప్రభుత్వం ప్రతి రంగంలో యాప్ ల ద్వారా ప్రజలకు సౌలభ్యంతో కూడిన డిజిటల్ విధానాన్ని ప్రవేశపెడుతోందన్నారు.తద్వారా డేటా సేకరణ సులువవుతుందన్నారు. రైతు సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి డిజిటల్ మార్గాలు అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమైన విషయమని అభివర్ణించారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వం మద్యం విక్రయాలు కేవలం నగదు ద్వారా మాత్రమే జరిపి భారీ కుంభకోణం చేసిందన్నారు. అంతేగాక గత ప్రభుత్వం చేపట్టిన విధానాలతో కల్తీ సారా తాగి జంగారెడ్డి గూడెంలో 23 మంది చనిపోయిన ఘటనను గుర్తుచేశారు. ప్రస్తుతం అలాంటి విధానాలకు తాము చెక్ పెట్టామన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని చోట్ల డిజిటల్ చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఏఐ, క్వాంటం టెక్నాలజీ లాంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంభించి పాలనలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారన్నారు.వసూళ్లలో చేతివాటం ప్రదర్శించిన అక్రమార్కులను చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. వారి నుండి తిరిగి వసూలు చేసే కార్యక్రమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు.
ఈ సందర్భంగా అందరికీ అందుబాటులోకి తెచ్చిన కలెక్టర్ పి. ప్రశాంతిని, జిల్లా అధికార యంత్రాంగాన్ని మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంతో మార్కెట్ యార్డుల ఆదాయానికి గండి పడకుండా రుసుం లక్ష్యాలను వంద శాతం చేరుకునేందుకు వీలుంటుందని అన్నారు. మార్కెట్ రుసుం లక్ష్యాలు పారదర్శకంగా జరుగుతాయన్నారు. నకిలీ రసీదులతో చేతివాటం ప్రదర్శిస్తున్న వారికి చెక్ పడుతుందన్నారు.
అంతకుముందు పెరవలి చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ కు స్థానిక నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.