నిడదవోలు పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు

నిడదవోలు టౌన్ మాస్టర్ ప్లానింగ్, పట్టణ అభివృద్ధి, సుందరీకరణ మౌలిక సదుపాయ కల్పన తదితర అంశాలపై జరిగిన అఖిలపక్ష భేటీలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

మున్సిపాలిటీ కార్యాలయంలో భేటీ అయిన అఖిలపక్ష నాయకులు.. పట్టణ అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు, అభిప్రాయాలు వెల్లడి

పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ హామీ

నిడదవోలు: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కలిసి పనిచేద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. గురువారం నిడదవోలు మున్సిపాలిటీ కార్యాలయంలో టౌన్ మాస్టర్ ప్లాన్ పై జరిగిన అఖిలపక్ష భేటీ చర్చలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు టౌన్ మాస్టర్ ప్లాన్, పట్టణ అభివృద్ధి, సుందరీకరణ, మౌలిక సదుపాయ కల్పన తదితర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం జరిగిన చర్చలో పలు పార్టీల నాయకులు పట్టణ అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు, అభిప్రాయాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్న అంశంపై మాస్టర్ ప్లాన్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏ పట్టణానికైనా మాస్టర్ ప్లాన్ అనేది ముఖ్యమైన డాక్యుమెంట్ అని తెలిపారు. స్థానిక ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయి నుండి పైస్థాయి వరకు అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకొని తదనుగుణంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకొని అమలు చేయాల్సి ఉంటుందని చెప్పడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 2047కు 100 ఏళ్లు పూర్తి చేసుకునే సందర్భంగా వికసిత్ భారత్ -2047 ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టారని, ఈ సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలు సేకరించి తదనుగుణంగా దేశాభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు మంత్రి దుర్గేష్ ఉదహరించారు. ఈ క్రమంలో స్వర్ణాంధ్ర-2047 ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందించారని తెలిపారు. 2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలని భావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామానికి అవసరమైన అభివృద్ధి ప్రణాళికలు రచించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. నిడదవోలు పట్టణం నేలపై పుట్టినవారికి ప్రాంతంపై మమకారం ఉంటుందని, తమ ప్రాంతం వారు ఏ విధంగా ఉండాలో ఊహించుకుంటున్నారో అలాంటి ఆలోచనలు తెలుసుకొని మాస్టర్ ప్లాన్ విజన్ ను రూపొందించామన్నారు. ఈ ప్రణాళిక తయారీలో అస్పష్టమైన విషయాలుంటే తమ దృష్టికి తేవాలని అధికారులు నోటీసుల ద్వారా పబ్లిక్ డొమైన్ లో పెట్టినట్లు మంత్రి తెలిపారు. పట్టణ అభివృద్ధికి సంబంధించి ఇంకా ఏమైనా ఆలోచనలు ఉంటే మున్సిపాలిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కార్యక్రమంలో భాగంగా పలువురు నేతలు స్థానికంగా నెలకున్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. అదే విధంగా నిడదవోలు పురపాలక సంఘం ముఖద్వారం కావాలని మంత్రి దుర్గేష్ దృష్టికి తీసుకువచ్చారు. అందుకు మంత్రి త్వరలోనే సంబంధిత సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో నిడదవోలు మున్సిపాలిటీ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ ఛైర్మన్ షేక్ నజీరుద్దీన్, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link