అధ్యక్షత వహిస్తున్న కేంద్ర కమిటీ నాయకులు జె రవి
ప్రథమ వర్ధంతి సభలో విప్లవ కవి సివి తనయుడు ఉదయభాస్కర్ మరియు రైటర్స్ అకాడమీ చైర్మన్ పివి రమణమూర్తి
బాల్యం నుండే ఆచార సంప్రదాయాలకు వ్యతిరేకంగా కృషి చేస్తూ కడ దాకా అదే ఆలోచనలతో, ఉద్యమాలతో జీవించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ జయ గోపాల్ అని ప్రముఖ విప్లవ కవి సివి తనయుడు ఉదయభాస్కర్ అన్నారు. ద్వారకా నగర్ పౌర గ్రంధాలయంలో ఈరోజు జరిగిన జయగోపాల్ ప్రథమ వర్ధంతి సభలో ప్రసంగిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో మూఢనమ్మకాల నిర్మూలనకు విశేష కృషి చేస్తున్న భారత నాస్తిక సమాజం వ్యవస్థాపకుడు డాక్టర్ జయ గోపాల్ దేశ ప్రజలను మూఢనమ్మకాల నుంచి జాగ్రత్త చేయడంలో ఆయన పోషించిన పాత్ర కీలకమని అన్నారు. రైటర్స్ అకాడమీ చైర్మన్, ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ రమణమూర్తి మాట్లాడుతూ బాల్యం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పెరియార్ రచనల ద్వారా ప్రభావితమై జీవితాంతం మతోన్మాద శక్తులపై పోరాడన్నారు. తన ఉపన్యాసాల ద్వారా, పుస్తకాల ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేశారన్నారు. ప్రస్తుతం దేశంలో మతోన్మాదులను విస్తరింపజేసి కలహాలు సృష్టించడమే కాకుండా అనేక మంది చావుకు పాలకులు కారణమవుతున్నారని, పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారని, ప్రస్తుత పరిపాలన ఎలా ఉందో జయ గోపాల్ రచనలు చదివితే చేస్తే తెలుస్తుందని, ఆనాడు జయగోపాల్ చెప్పినట్టే నేడు మతం పిచ్చిలో ప్రజలను నెట్టి పాలకులు దోపిడీ చేస్తున్నారన్నారు. జై గోపాల్ రచనలు పిల్లలకు పాఠ్యాంశాలుగా పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు టి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ 1972లో భారత నాస్తిక సమాజం జయగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని నాస్తిక యుగం, ఏజ్ ఆఫ్ ఏతిజం పత్రికలు ఆనాడు తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లపై మొదటగా ఏజ్ ఆఫ్ ఏతీజం లో వచ్చిందని గుర్తు చేశారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థలో సభ్యులుగా జయగోపాల్ వ్యవహరించారని, అందుచేతనే ఐక్యరాజ్యసమితి విభాగంలో మానవ హక్కుల నేతగా జయ గోపాల్ ఫోటో అక్కడ ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ నాయకులు జె రవి మాట్లాడుతూ జయ గోపాల్ సుమారు 35 పుస్తకాలు తెలుగుతోపాటు ఇతర భాషల్లో రాశారని, అదేవిధంగా ఇస్లామిక్ దేశాల్లో మానవ హక్కులు, మహిళలపై జరుగుతున్న దాడులపై గళం విప్పారన్నారు. గతంలో తిరుపతిని వాటికన్ సిటీలా స్వతంత్ర ప్రతిపత్తి చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రయత్నించగా దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడం ద్వారా ఒత్తిడి తీసుకువచ్చి దానిని ఆపేలా చేశారని గుర్తు చేశారు.
కార్యక్రమంలో మొదటగా జయగోపాల్ చిత్రపటానికి అతిధులంతా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భారత నాస్తిక సమాజం నాయకులు సాయిని నరేందర్, ఉప్పులేటి నరేష్, వ నూకరాజు, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ నాయకులు వేదాంత మౌర్య, కొత్తపల్లి వెంకటరమణ, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, రవి సిద్ధార్థ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.