125 సంవత్సరాలు పరిశుద్ధ మరియు తల్లి కాపుదలలో జ్ఞానాపురం
విశాఖపట్నం: జూలై 30 (కోస్టల్ న్యూస్)
విశాఖలో జ్ఞానాపురంలో దేవమాత మోక్షరోపణ మహోత్సవం వివరాలు కోసం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జాన్ ప్రకాష్ మాట్లాడుతూ 125 సంవత్సరాల క్రితం, అనగా 1900వ సంవత్సరంలో జ్ఞానాపుర గ్రామానికి సోకిన కలరా వ్యాధి, మొత్తం గ్రామాన్నే గడగడలాడించింది. గ్రామస్తులను భయకంపితులనుచేసింది. గ్రామములో అల్లకల్లోలం చెలరేగింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత వైద్యం చేసిన వ్యాధి మాత్రం తగ్గుదలకు రాలేదు సరికదా, మరింత ముదిరిపోయింది. రోజు రోజుకీ మృతుల సంఖ్య పెరిగిపోయి పలువురు గ్రామస్తులు మరణం పాలయ్యారు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో అప్పటి విచారణ కర్తలైన స్వర్గీయ మహ రోషియోన్ బిషప్ గ్రామ ప్రజలందరినీ సంఘటిత పరచి, సమాయత్తపరచి గ్రామాన్ని, గ్రామ ప్రజలను మరియు తల్లికి సమర్పించారు. ఆ తల్లి విడుదల సహాయం కోరుతూ ఎడతెగని ప్రార్థనలు చేసారు. అనతి కాలంలోనే ఊహలకందని రీతిలో కలరా మహమ్మారి మటుమాయమయింది. ఆ అద్భుత స్వస్థతను గుర్తించిన గ్రామస్తులు కృతజ్ఞతా పూర్వకంగా అదే ఏడాది ఆగష్టు నెలలో ఆ తల్లి తేరును భక్తి ప్రపత్తులతో పుర వీధులలో ఊరేగిస్తూ, ప్రార్థనలు చేస్తూ,పాటలు పాడుతూ ప్రదక్షిణలు చేశారు.చివరగా ఆగష్టు 15న ఊరంతా కలిసికట్టుగా గొప్ప పండుగను కొనియాడారు. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రతి ఏడాదీ ఆ అద్భుత ఘట్టాన్ని స్మరించుకుంటూ క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు కొత్త మెరుగులు దిద్దుకుంటూ ఆగష్టు 1 నుండి 15 వరకు ఈ పండుగను ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటున్నారు అని తెలియచేసారు. కలరా వ్యాధి నుండి జ్ఞానాపుర గ్రామానికి విమోచన,విదేశీ పాలకుల నుండి మన భారతదేశానికి విమోచన, పరిశుద్ధ దేవమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడిన వేద సత్యంలో మర్మగర్భమైన మానవ విమోచన పండగల సంఘమమే.ఈ గ్రామ పండుగ ప్రాముఖ్యత. అదే ఆగష్టు 15.ఇప్పటికి ఈ జ్ఞానాపుర గ్రామ పండుగకు 125 సంవత్సరాలు నిండాయి అని ముచ్చటైన ఈ మూడు పండుగల వేడుకలో పాల్గొన ప్రతి ఒక్కరికీ ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానము అని తెలిపారు.ఈ కార్యక్రమంలో విచారణ కర్త జొన్నాడ జాన్ ప్రకాష్, పి పి సి అధ్యక్షులు శ్రీముసిరి రాజేష్, ఆనందరావు మాస్టర్, పొలమరశెట్టి ఫ్రాన్సిస్, గండి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.