నేటి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
అభివృద్ధిలో రెండు దశాబ్దాల పాటు వెనక్కు నెట్టిన జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులోని వీకే సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఏడాదికాలంగా చేసిన అభివృద్ధి, సంక్షేమంతో రాష్ట్రం సుపరిపాలన దిశగా కొనసాగుతూ ఉందని అన్నారు. ఒక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మేరకు సంక్షేమాన్ని అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు పోలవరం నిర్మాణం, అమరావతి నిర్మాణంతోపాటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పారు. యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా రూ. 9:50 లక్షల కోట్ల పెట్టుబడును సాధించి సుమారు 5 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు మార్గం సుగమం చేసినట్లు వెల్లడించారు. జూలై 2 నుంచి ఆగస్టు 2 వరకు నెలరోజులపాటు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం అత్తిలి మండలం కే సముద్రపు గట్టు గ్రామంలో ఉదయం 8 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భాగస్వాములు కావడంతో పాటు ఇంటింటికి వెళ్లి ఎవరికీ ఎంత మేర పథకాలు అందించాము.. ఏ హామీలు అమలు చేశము అనేది వారికి తెలియజేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఇందుకు సంబంధించి 234 బూత్ ల వారీగా ఇన్చార్జిలు బాధ్యతలు తీసుకోవాలని కోరారు. రోజుకు 30 గృహాలను సందర్శించి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు. తణుకు నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం సమావేశాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో తణుకు నియోజవర్గానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.