24 గంటల్లో నిడదవోలు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లకు గాను రూ.672 కోట్ల విడుదలకు అంగీకరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,988 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అదే సందర్భంలో నిడదవోలు నియోజకవర్గంలోని ధాన్యం బకాయిల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. తొలకరి ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్రంతో మాట్లాడి రైతుల ఖాతాల్లో డబ్బుల జమకు చర్యలు తీసుకున్నారని, ఈ అంశం కేబినెట్ దృష్టికి వచ్చిందని మంత్రి దుర్గేష్ తెలిపారు.ఇప్పటివరకు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని మంత్రి చెప్పారు.ప్రభుత్వానికి, రైతాంగానికి మధ్య వ్యవసాయ శాఖ అధికారులు వారధులుగా ఉండి, రైతాంగం సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా సూచించారు.
అన్నదాత సుఖీభవ, ప్రకృతి వ్యవసాయం, రైతులకు వడ్డీ లేని రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ, డిజిటల్ వ్యవసాయం, విత్తనాల రాయితీ, ఎరువుల సరఫరా, పంటల బీమా, కనీస మద్దతు ధర వంటి వాటితో రైతన్నలకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. అంతేగాక గత ప్రభుత్వం రైతులను దుర్మార్గంగా మోసం చేసి సుమారు రూ.1674 కోట్ల ధాన్యం డబ్బులు బకాయి పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించిందని మంత్రి కందుల దుర్గేష్ గుర్తుచేశారు.