మంత్రి కందుల దుర్గేష్
భూగర్భజలాల పెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ భారం తగ్గడమే లక్ష్యంగా మ్యాజిక్ డ్రైన్ల ను ఏర్పాటు చేసే అంశం పై కూటమి ప్రభుత్వం కసరత్తు చేసిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం నిడదవోలు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఈ మేరకు మ్యాజిక్ డ్రైన్ల ఏర్పాటు, తద్వారా కలిగే ప్రయోజనాలు, అకిరా మియావాకి విధానం తదితర అంశాల గురించి అధికారులనడిగి మంత్రి దుర్గేష్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అకిరా మియావాకి విధానంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు పారడానికి రహదారుల పక్కన ఇప్పటి వరకు నిర్మిస్తున్న సాధారణ సిమెంట్ కాలువ స్థానంలో మ్యాజిక్ డ్రైన్‌ను ఏర్పాటు చేసి తద్వారా పారిశుద్ధ్యనికి చెక్ పెట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. తద్వారా మురుగు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లే సమస్య ఉండదని, పంచాయతీలకు పారిశుద్ధ్య నిర్వహణ భారం తగ్గుతుందని,పల్లెల్లో మురుగు కాల్వల సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే నీరు నిల్వ ఉండకుండా మ్యాజిక్ ట్రైన్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అన్నారు.