అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
పాలిలో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
సమాజంలో యువత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాబోయే పది తరాలపై ప్రభావం ఉంటుందని ఇందుకు మహానీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నిదర్శనమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం పాలి గ్రామానికి చెందిన లూధరన్ చర్చి, జీడీఎం చర్చి యూత్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను మంగళవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆవిష్కరించారు. గ్రామాల్లో మొట్టమొదటిసారిగా అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జీవిత చరిత్రను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఉన్నత స్థానంలోకి ఎదగడంతోపాటు పదిమందిని ప్రభావితం చేసేందుకు కుటుంబ ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేకుండా స్వసక్తితో ఉన్నత చదువులు చదువుకుంటూ దేశంలో ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసిన అంబేద్కర్ జగ్జీవన్ రామ్ మార్గదర్శకులు అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశానికి దిక్సూచిగా నిలిచిందని అన్నారు. కేంద్ర మంత్రిగా, భారత దేశ ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రామ్ దేశానికి ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అత్తిలి, తణుకు ఏఎంసీ చైర్మన్లు దాసం ప్రసాద్, కొండేటి శివ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.