ఉపాధి పథకంలో పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
అత్తిలి మండలం పాలి గ్రామంలో ప్రారంభించిన ఎమ్మెల్యే
రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులకు పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం అందజేస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒకరోజు ఉద్యమ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం అత్తిలి మండలం పాలి గ్రామంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని రైతులకు ప్రయోజనకరంగా ఉంటూ, వారికి ఆదాయాన్ని చేకూర్చే విధంగా పండ్ల మొక్కలు నాటేందుకు వారిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అర ఎకరం నుంచి 5 ఎకరాలులోపు ఉన్న ప్రతి రైతు ఉద్యానవన పంటలతో పాటు పండ్లు తోటలు పెంచే విధంగా వారిలో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అర ఎకరం పొలం ఉన్న రైతులు దాదాపు దాదాపు 30 కొబ్బరి మొక్కలు పెంచే విధంగా వారికి ప్రభుత్వం నుంచి రూ.49 వేలు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. మూడేళ్ల పాటు మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రభుత్వం ఈ పథకం ద్వారా తీసుకుంటుందన్నారు. తణుకు నియోజకవర్గంలో దాదాపు 150 ఎకరాల్లో పండ్ల తోటలు పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఎవరి పొలంలో వాళ్లు కంపోస్టు తయారు చేసుకునే విధంగా మూడు పనిదినాలకు సంబంధించి రూ. 900 అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.