పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని వెంకటరాయపురంలో, ఆంధ్రా షుగర్స్ వ్యవస్థాపకులు, “ఆంధ్రా బిర్లా” గా ప్రసిద్ధులైన ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 105వ జయంతి సందర్భంగా మహా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించబడ్డాయి. శ్రీ ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ (ట్రస్ట్) హాస్పిటల్, తణుకు, ముళ్లపూడి వెంకటరాయుడు ఐ సెంటర్, ముళ్లపూడి కమలాదేవి కార్డియాక్ సెంటర్, కిమ్స్ (బొల్లినేని), రాజమండ్రి సహకారంతో సొమవారం నిర్వహించిన ఈ మహా వైద్యశిబిరంలో పేదలు మరియు ఆర్థికంగా వెనుకబడినవారికి ఉచిత వైద్య సలహాలు, రక్తపరీక్షలు, మందులు అందించబడ్డాయి. తణుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సేవలను ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డా. ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ (హరిబాబు) మాట్లాడుతూ తణుకు ప్రాంతాన్ని పారిశ్రామికంగా, సాంస్కృతిక కళల అభివృద్ధికి, అధునాతన వైద్య పరంగా ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు తక్కువ ఖర్చులో అందించాలని సదుద్దేశంతో సువిశాలమైన ప్రాంగణంలో హరిచంద్ర ప్రసాద్ ఈ హాస్పిటల్ ను నెలకొల్పారని అన్నారు. ఆయన స్ఫూర్తితో నేటికీ ఈ ట్రస్ట్ హాస్పిటల్ సమీప ప్రాంత ప్రజల కొరకు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డా. ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, సి.యి.ఓ కె. వీరబాబు, డి.ఎం.ఎస్. డా. ఎం. రాజగోపాల్,
తదితర వైద్య బృందం, ఆసుపత్రి సిబ్బంది పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.
