తిరుమల, తిరుపతి పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
తిరుపతి: రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చన సేవలో మంత్రి దుర్గేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాప వినాశనం వెళ్లే దారిలో జాపాలి తీర్థం, వేణుగోపాల స్వామి ఆలయాన్ని మంత్రి దుర్గేష్ సందర్శించారు. ఈ సందర్భంగా తిరుమలలో శ్రీవారి సేవకు విచ్చేసిన నిడదవోలు వాసులు మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం మధ్యాహ్నం తిరుపతి చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని పురాతన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ప్రసిద్ధ శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేళ తాళాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆలయ అధికారులు మంత్రి కందుల దుర్గేష్ కు ఘన స్వాగతం పలికారు.. ఆ తర్వాత శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామిని, శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ అధికారులతో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అంశాలపై చర్చించారు.. త్వరలోనే ఆయా ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.