తిరుమల శ్రీవారి సేవలో నిడదవోలు సేవకులు విశేష సేవలు అందిస్తున్నారని అభినందన
మూలవిరాట్ కు నిర్వహించే ప్రసిద్ధమైన అర్చనసేవలో పాల్గొన్న అనంతరం తిరుమలలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని కుటుంబసమేతంగా సందర్శించిన మంత్రి దుర్గేష్
తిరుమల : తిరుమలలో పర్యటిస్తున్నపర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను శ్రీవారి సేవ నిమిత్తం తిరుమలకు వచ్చిన నిడదవోలుకు చెందిన ఓ మహిళా బృందం కలిసింది. ఈ సందర్భంగా తిరుమలలో తోటి యాత్రికులకు నిస్వార్థంగా ఉచిత సేవను అందిస్తూ అధ్యాత్మిక భావంలో మునిగితేలుతున్న నిడదవోలుకు చెందిన మహిళా బృందాన్ని మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. ఈ సందర్భంగా వారు ఆనందం వ్యక్తం చేశారు. లక్షలాదిగా తిరుమలకు తరలివచ్చే భక్తులందరూ స్వచ్ఛంద సేవలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు మూలవిరాట్ కు నిర్వహించే ప్రసిద్ధమైన అర్చనసేవలో పాల్గొన్న అనంతరం తిరుమల నుండి పాపవినాశనం వెళ్లే దారిలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని కుటుంబసమేతంగా మంత్రి దుర్గేష్ దర్శించుకున్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి చెంతన నిర్వహించిన సేవలో పాల్గొనడం తనకు కలిగిన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కు తితిదే అధికారులు ఘన స్వాగతం పలికారు.