అసోసియేషన్ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ప్రతినెల ఒకటో తేదీన పెన్షన్లు అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. మున్సిపల్ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం తణుకులో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెన్షనర్లకు ఎప్పుడు పెన్షన్లు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని చెప్పారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నర్సింహమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో దీర్ఘకాలికంగా పని చేసి ఎన్నో సేవలు చేసి మున్సిపాల్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. మున్సిపాల్టీ ఆదాయం పెరగడానికి మున్సిపల్ శాఖలో ఆయా విభాగాలకు చెందిన ఉద్యోగులు కారణమన్నారు. మున్సిపల్ ఉద్యోగులు రిటైర్డ్ అయ్యాక వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. పెన్షన్లు అందుకోవడంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. ఉద్యోగులు రిటైర్ అయ్యిన రోజునే వారికి వచ్చే బెనిఫిట్స్ అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
