అన్ని వర్గాలను అణగదొక్కిన జగన్‌మోహన్‌రెడ్డి

రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిన జగన్‌

ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

అత్తిలి ఏఎంసీ ఛైర్మన్‌ దాసం ప్రసాద్‌ ప్రమాణస్వీకారం

పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌అధికార దాహంతో గత అయిదేళ్ల కాలంలో అన్ని వర్గాలకు అణగదొక్కిన జగన్‌మోహన్‌రెడ్డి బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలకు పదవులు కట్టబెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌లకే చెందుతుందని అన్నారు. అత్తిలి మార్కెట్‌ కమిటీ నూతన ఛైర్మన్‌గా దాసం ప్రసాద్, వైస్‌ ఛైర్మన్‌ కడలి రామాంజనేయులుతోపాటు పాటు కమిటీ సభ్యులు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. అత్తిలి మార్కెట్‌ యార్డ్‌ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ అధ్యక్షత వహించి మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తులను సర్వనాశనం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో దుర్మార్గమైన పాలనను తరిమికొట్టడంతోపాటు రాష్ట్ర పునర్నిర్మాణానికి బాట వేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తూ సంక్షేమం, అభివృద్ధి ఏకకాలంలో అమలు చేస్తున్నారని చెప్పారు.

సిగ్గులేని వైసీపీ నేతలు: ఎమ్మెల్యే బొలిశెట్టి

రాష్ట్రంలో మరోసారి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని భావించి చంద్రబాబు అవసరం ఉందని భావించిన ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. దొంగలుగా నిరూపణ అయ్యాక కూడా సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు రోడ్డెక్కి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రూ. కోట్లు మేర ప్రజాధనం దోచుకున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కనీసం జగన్‌మోహన్‌రెడ్డి కూడా గెలుస్తాడనే నమ్మకం లేదన్నారు.

రైతులకు అండగా ఉంటా: దాసం ప్రసాద్‌

అత్తిలి మండలంలోని రైతులకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ వారికి ఏకష్టం వచ్చినా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సహకారంతో తన వంతు సహకారం అందిస్తానని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన అత్తిలి ఏఎంసీ ఛైర్మన్‌ దాసం ప్రసాద్‌ పేర్కొన్నారు. కేవలం రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశం లేదని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి స్వీకరించానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రైతులకు ఇబ్బందులు లేకుండా పుంత రోడ్లు నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. అంతకు ముందు దాసం ప్రసాద్‌ కార్యాలయం నుంచి భారీ బైక్‌ ర్యాలీతో సభాస్థలికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, టిడిపి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, తణుకు మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ దొమ్మేటి వెంకట సుధాకర్, తణుకు ఏఎంసీ ఛైర్మన్‌ కొండేటి శివ, అత్తిలి మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ దాసం బాబ్జి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link