తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి – తణుకులో ఘనంగా పొట్టిశ్రీరాములు జయంతి
సమాజంతోపాటు మన ప్రాంతం, మన భాష పట్ల అభిమానం పెంచుకోవాలనే స్ఫూర్తితో పొట్టి శ్రీరాములు త్యాగఫలంగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిఒక్కరు పాటుపడాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్న అన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసికెళ్లేందుకు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతి పురస్కరించుకుని తణుకు రాష్ట్రపతి రోడ్డులో కోర్టు ఎదురుగా శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పొట్టి శ్రీరాములు జయంతి నిర్వహించడం గర్వించదగిన విషయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆశయ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. పొట్టి శ్రీరాములు ఉన్నత చదువులు చదివినప్పటికీ సమాజం పట్ల బాధ్యతతో ప్రజల్లో చైతన్యం కోసం నిరంతరం పరితపించేవారన్నారు. గాంధేయవాదిగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఆయన అప్పట్లో కులవివక్షకు వ్యతిరేకంగా హరిజనోద్ధారణ కోసం కృషి చేశారని చెప్పారు. బాషాప్రయుక్త రాష్ట్రాలు కావాలని అప్పట్లో మద్రాసీయులుగా చూస్తున్న కాలంలో ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఉండాలని 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తద్వారా ప్రాణత్యాగం చేసి ఆంధ్రరాష్ట్రాన్ని సాధించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.