తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి – 17 మందికి రూ. 23 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా వైద్య చికిత్స రూ. 2.50 లక్షలు దాటిన ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షలు బీమా కల్పించి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. క్యాన్సర్ తోపాటు కాలేయ సంబంధిత వ్యాధులకు సైతం బీమా ద్వారా వైద్యం చేయించుకునే అవకాశం కల్పించి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. అనారోగ్యం పాలై సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని బిల్లులు ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం అందజేశారు. తణుకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 17 మందికి రూ. 23 లక్షలను చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో వైద్య సేవలు పొందలేక సొంతఖర్చులతో వైద్యం చేయించుకున్న వారిని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి ఆదుకుంటున్నారని అన్నారు. 9 నెలల కూటమి ప్రభుత్వంలో కేవలం తణుకు నియోజకవర్గం పరిధిలో దాదాపు రూ. 2.50 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థికసాయం అందజేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అయిదేళ్లలో కేవలం రూ. 2 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి తణుకు ఎమ్మెల్యేకు దరఖాస్తులు చేసుకుంటే వాటిని బుట్టదాఖలు చేశారని విమర్శించారు. గత పాలకులకు పేదల పట్ల ఎంత ప్రేమ ఉందో ఇందుకు నిదర్శనమన్నారు. కేవలం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన గత పాలకులకు కనీసం దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు బిల్లులు పెట్టుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయన్నారు. అలాంటి వారిని కూడా ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.