రేపు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రూ.77.91 కోట్లతో గండికోట పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనకు సర్వం సిద్ధం
రూ.165 కోట్ల విలువైన 5 పర్యాటక ప్రాజెక్టులకు సీఎం వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని వెల్లడి
యునెస్కో గుర్తింపు వచ్చేలా గండికోట, అహోబిలంలను తీర్చిదిద్దుతామని స్పష్టం
గత ఐదేళ్లలో రాష్ట్ర వారసత్వ సంపదను కాపాడుకోవాలన్న ఇంగిత జ్ఞానం వైకాపా ప్రభుత్వం చేయలేకపోయిందని విమర్శలు
గండికోట పర్యాటక ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్.. మంత్రి దుర్గేష్ కు కడప ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన జిల్లా జనసైనికులు
మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక శ్రద్ధతో పర్యాటకం పరుగులు పెడుతుందని జిల్లా ఇంచార్జ్ మంత్రి సవిత ప్రశంసలు
వైఎస్సార్ కడప జిల్లా: గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోట వారసత్వ సంపదకు మహర్దశ రానుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గురువారం వైఎస్సార్ కడప జిల్లా గండికోటకు వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ టూరిజం ఎండీ ఆమ్రపాలి కాటతో కలిసి సభాస్థలితో పాటు గండికోటలోని జుమ్మా మసీదు, ధాన్యాగారం, పెన్నాలోయ వ్యూ పాయింట్, ఎర్రకోనేరు, మాధవరాయస్వామి, రంగనాథ ఆలయాలు, పావురాల గోపురం, మందుగుండు సామాగ్రి గిడ్డంగి, మీనార్లు, జైలు, రంగ్ మహల్ రోప్ వే పాయింట్, గుర్రపు శాలల ప్రదేశాలన్నింటికి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్ అకాడమీలో స్థానిక మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ శాస్కి స్కీమ్ ద్వారా మంజూరైన రూ.77.91 కోట్లతో గండికోట పర్యాటక ప్రాజెక్టు పనులకు సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.165 కోట్ల విలువైన 5 పర్యాటక ప్రాజెక్టులకు సీఎం వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని వివరించారు. అందులో భాగంగా రూ.29.87 కోట్లతో బొర్రా గుహల సుందరీకరణ, లైటింగ్ పనులు, పాత్ వే, ఎమినిటీస్ సెంటర్లు, ఇతర సౌకర్యాలు, బుద్దిజంను విశ్వవ్యాప్తం చేసిన పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ ప్రాంతంలో ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్ మెంట్ (సీబీడీడీ) క్రింద రూ.25 కోట్లతో చేపట్టనున్న వాటర్ స్పోర్ట్స్, బుద్ధిస్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ పనులకు , నంద్యాల జిల్లా అహోబిలం దేవాలయంలో రూ.25 కోట్లతో ఆధునికీకరణ, సుందరీకరణ పనులు,ఇతర వసతి సౌకర్యాలు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారన్నారు. అంతేగాక ఇటీవల కేబినెట్ లో 4 హోటల్స్ ఆమోదం పొందగా అందులో తిరుపతిలోని పావని హోటల్స్ బ్రాండ్ భాగస్వామి లెమన్ ట్రీ ప్రీమియర్ తో కలిసి రూ.80 కోట్ల పెట్టుబడితో 116 రూమ్స్ ఏర్పాటు చేసి 300 మందికి ప్రత్యక్షంగా, 600 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ప్రాజెక్టుకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఇప్పటికే ఎంఓయూ చేసుకున్నామన్నారు అనంతరం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
గండికోటకు అంతర్జాతీయ ఖ్యాతి:మంత్రి దుర్గేష్
అద్భుతమైన వారసత్వ సంపదగా కీర్తిగాంచిన గండికోట పర్యాటక ప్రాజెక్టుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. శంకుస్థాపన అనంతరం పనులు ప్రారంభమవుతాయన్నారు.వ్యూపాయింట్స్, చారిత్రక, వారసత్వ కట్టడాల అభివృద్ధికి రూ.28 కోట్లు, బోటింగ్ సదుపాయాలకు రూ.1.24 కోట్లు, పర్యాటకుల సందర్శన, ఇతర అభివృద్ధికి రూ.12.73 కోట్లు, పర్యాటకుల సదుపాయాలు, సేవా కేంద్రాలకు రూ.15.11 కోట్లు, టెంట్ సిటీ అభివృద్ధికి రూ.5.05 కోట్లు, వనరుల పరిరక్షణకు రూ.2.62 కోట్లు,గార్జ్ వైభవానికి రూ.89 లక్షలు మొత్తంగా జీఎస్టీతో కలిపి రూ.77.91 కోట్లు ఖర్చు చేయనున్నామని మంత్రి దుర్గేష్ వివరించారు.గండికోటకు వచ్చే పర్యాటకులు ఒకరోజుకే పరిమితం కాకుండా మరిన్ని రోజులు ఇక్కడ గడిపేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలు చేశారన్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబునాయుడు ముందు చూపుతో ఏపీ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పనతో పాటు నూతన పర్యాటక పాలసీ 2024-29 ప్రకటించిన విషయం గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆకర్షితులై పీపీపీ విధానంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు.
సర్వాంగ సుందరంగా గండికోట:మంత్రి దుర్గేష్
గండికోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.గండికోటను రెండు రకాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నామన్నారు. గండికోట పోర్ట్ అద్భుతమైన కట్టడమని, దీనిలో భాగంగా వివిధ కట్టడాలతో పాటు పురాతన రంగనాథ స్వామి ఆలయం, జుమ్మా మసీదును అనుసంధానించి పాత్ వే ఏర్పాటు ద్వారా సందర్శకులు సులువుగా సందర్శించుకునేలా చేస్తామన్నారు. గార్జ్ ప్రాంతంలో సహజ సిద్ధంగా ప్రవహిస్తున్న నదీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఎమినిటీస్ లో భాగంగా మినీ థియేటర్, చిల్డ్రన్ ఏరియా, టాయిలెట్లు, ప్రకృతి సౌందర్యాలు వీక్షించేలా వ్యూపాయింట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కుంభమేళా తరహాలో ఖాళీ ప్రదేశంలో పర్యాటకులకు వసతి కల్పించేలా 30 పాలిష్డ్ టెంట్ లు ఏర్పాటు చేయనున్నామన్నారు.
యునెస్కో గుర్తింపు వచ్చేలా చర్యలు:మంత్రి దుర్గేష్
అహోబిలం, గండికోట ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు వచ్చేలా తీర్చిదిద్దాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో అక్కడి సహజ శిల్ప కళా నైపుణ్యాలు, చారిత్రక కట్టడాల వైభవం చెక్కు చెదరకుండా సుందరీకరణ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఆ దిశగా తాము కృషి చేస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.
గండికోటలో 5 స్టార్ హోటల్స్ ఏర్పాటు..ఏపీలో 15-20 హోటల్స్ ఏర్పాటుకు కృషి:మంత్రి దుర్గేష్
గండికోట పర్యాటక ప్రాంతానికి సమీపంలో ఒబెరాయ్ గ్రూప్ 5 స్టార్ హోటల్ పెట్టేందుకు ముందుకు వచ్చిందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఒబెరాయ్ హోటల్ కు శుక్రవారం సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఏపీలో పీపీపీ విధానంలో దాదాపు 15-20 హోటల్స్ ను తీసుకొస్తున్నామన్నారు.
ఏపీలో పర్యాటక వృద్ధి:మంత్రి దుర్గేష్
ఏపీలో పర్యాటక రంగం వేగంగా వృద్ధి చెందుతుందన్నారు.పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు సీఎం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ఇన్వెస్టర్లు, అధికారులు అందరి చురుకైన పాత్ర కారణమన్నారు.విజయవాడలో రెండు సార్లు, విశాఖపట్టణం, ముంబయిలలో ఇన్వెస్టర్ సమ్మిట్ లు నిర్వహించామన్నారు. ఇటీవల సీఎం సమక్షంలో దాదాపు రూ.10వేల కోట్లవిలువైన ఎంవోయూలు చేసుకున్నామన్నారు. ల్యాండ్ పార్సిల్ ను బహిరంగంగా అడ్వర్ టైస్ చేసిన నేపథ్యంలో ఇన్వెస్ట్ మెంట్ లకు డిమాండ్ పెరిగిందని, ఈ సందర్భంగా ఒకే ప్రదేశంలో ఇద్దరు ముగ్గురు పెట్టుబడులు పెట్టాలని ముందుకు వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో ఆయా కంపెనీల స్థితిగతులు, బెటర్ ట్రాక్ రికార్డు, తట్టుకొని నిలబడి పూర్తి చేయగల సామర్థ్యం, ఎంప్లాయిమెంట్ పాలసీ ద్వారా ఎక్కువ మందికి ఎవరు ఉపాధి ఎవరు కల్పిస్తారు తదితర అంశాలు పరిగణలోకి తీసుకొని అత్యుత్తమ కంపెనీలను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నామన్నారు.
గడిచిన నెలలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ చేతుల మీదుగా రూ.94.44 కోట్లతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయం గుర్తుచేశారు. స్వదేశీ దర్శన్ స్కీమ్ క్రింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.53 కోట్లు కేంద్రం మంజూరు చేసిన విషయం గుర్తుచేశారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన కార్యక్రమాలు ఒకవైపు, మరోవైపు సీఎం చంద్రబాబునాయుడు ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలతో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు.
గడిచిన ఐదేళ్లలో పర్యాటకాభివృద్ధి శూన్యం:మంత్రి దుర్గేష్
గడిచిన ఐదేళ్ల వైకాపా పరిపాలనలో పెట్టుబడిదారులు పెట్టబడులు పెట్టాలంటే భయపడి పారిపోయే పరిస్థితి నుండి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధం అనే స్థాయికి తీసుకొచ్చామన్నారు.గడిచిన 5 ఏళ్లలో గండికోట పర్యాటక అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం ఏనాడూ కృషి చేయలేదన్నారు. రాష్ట్ర వారసత్వ సంపదను కాపాడుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేని పరిపాలనను గతంలో చూశామన్నారు.కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర సాంస్కృతిక, కళా వికాసం, వారసత్వ సంపదను, యునెస్కో సైతం గుర్తించేలా ఉన్న కట్టడాలను కాపాడుతున్నామన్నారు.గండికోటను ప్రపంచవ్యాప్తంగా సందర్శించేలా తీర్చిదిద్దుతామన్నారు.
పర్యాటక రంగంపై మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పరుగులు పెడుతుంది:జిల్లా ఇన్ చార్జి మంత్రి సవిత
జిల్లా ఇన్ చార్జి మంత్రి సవిత మాట్లాడుతూ మంత్రి కందుల దుర్గేష్ ను ప్రశంసించారు.గడిచిన ఐదేళ్లలో పర్యాటక రంగం అభివృద్ధి కుంటుపడితే ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం, ప్రత్యేకించి పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరుగులు పెట్టిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా కడపలో అనేక కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ప్రధాన మంత్రి ఆశీర్వాదంతో, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దిశానిర్దేశంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందన్నారు. జమ్మలమడుగు సమీపంలో గూడెంచెరువు గ్రామంలో పెన్షన్ అందించేందుకు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పెన్షన్ ఇచ్చిన అనంతరం సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసుకోనున్నారని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4000 పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. పెన్షన్ అందించే సమయంలో 1వ తేదీ ఆదివారం, సెలవుదినం వస్తే ముందురోజే పెన్షన్లు అందిస్తున్నామన్నారు. పెన్షన్లను పెంచి వికలాంగులకు రూ.6000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.15000 అందిస్తున్నామన్నారు.కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామన్నారు. ఆగస్ట్ 15నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించనున్నామన్నారు. రైతన్నలకు అన్నదాత సుఖీభవ అందిస్తామన్నారు. తెలుగుదేశం కార్యకర్తలతో సీఎం భేటీ అవుతారని తెలిపారు. పీ4తో పేదరిక నిర్మూలన చేయాలన్న లక్ష్యంతో ఆ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనలో పాల్గొంటారని తెలిపారు.
ప్రతి కేబినెట్ లో సీఎం చంద్రబాబునాయుడు టూరిజం ప్రస్తావన తెస్తారని, టూరిజం అభివృద్ధి చేసి సంపద సృష్టించాలని చెబుతారన్నారు. రూ.78 కోట్లతో గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రూ.165 కోట్లతో వివిధ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేస్తున్నారని మంత్రి సవిత వివరించారు.జేఎస్ డబ్ల్యూ కి ప్రత్యేక జీవో ఇచ్చిన విషయం గుర్తుచేశారు. అనేక పరిశ్రమలను సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రానికి తీసుకొస్తున్నారన్నారు.ప్రజలు, కార్యకర్తలు సీఎం రాకకోసం ఎదురుచూస్తున్నారన్నారు.
అంతకుముందు మంత్రి కందుల దుర్గేష్ కు కడప ఎయిర్ పోర్టులో జిల్లా జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
సమావేశంలో వైఎస్సార్ కడప జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సవిత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, స్థానిక సర్పంచ్ నారాయణరెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.