అమరజీవి పొట్టి శ్రీరాములకు అవమానం

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి
పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాల వేసి గౌరవించకపోవడం చాలా బాధాకరమని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా బీచ్ రోడ్ లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా జరిపించిందని చెప్పారు. అయితే తర్వాత పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములును ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన విగ్రహానికి
లేదా చిత్రపటానికైనా పూలమాలలు వేసి నివాళులర్పించాల్సిన బాధ్యత అటు ప్రజా ప్రతినిధుల పైన అలాగే అధికారుల పైన ఉందని చెప్పారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములను పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో బీచ్ రోడ్డులో గల పోట్టి శ్రీరాములు విగ్రహాన్ని శుభ్రం చేయడం గాని లేదా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం గాని ఎవరు చేయలేదని చెప్పారు. కనీసం మేయర్ లేదా ఇతర అధికారులు ఆ ఊసే ఎత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అటువంటి గొప్ప వ్యక్తిని మర్చిపోవడం చాలా విచారకరమని ఆవేదన చెందారు. ఇక మీదట అయినా సరే ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కృష్ణ, వెంకట్, టమాట అప్పారావు, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link