అతి పురాతనమైన రథయాత్ర – పూరీ జగన్నాథుని రథయాత్ర

ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణంలాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది.

🔸 జులై 7న పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవం జరగనుండగా ఈసారి ఒకే రోజున నవయవ్వన వేడుక, నేత్రోత్సవం, ఘోషయాత్ర నేత్రపర్వంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

🔸 చివరిసారిగా 1971లో ఒకే రోజున మూడు వేడుకలు జరగ్గా 53 ఏండ్ల తర్వాత ఇది పునరావృతమైంది.

🔸 ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకి వాడతారు. కానీ పూరీలో అలాకాదు! సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు. ఆ సమయంలో వాళ్లని ఏ మతం వాళ్లయినా చూడవచ్చు.

🔸 ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారుచేస్తారు. వీటి తయారీని అక్షయతృతీయ రోజున మొదలుపెడతారు. జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడధ్వజం అనీ బలభద్రుని కోసం తయారుచేసే రథాన్ని తాళధ్వజం అనీ సుభద్ర కోసం తయారుచేసే రథాన్ని దేవదాలన అనీ పిలుస్తారు.

🔸 ఈ రథాలని తయారుచేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి. దానికి ఎన్ని చక్రాలు ఉండాలి. ఆ చక్రాలు ఎంత ఎత్తు ఉండాలిలాంటి లెక్కల్ని తూచాతప్పకుండా పాటించాలి. రథాన్ని తయారుచేసేందుకు ఎన్ని చెక్కముక్కలు వాడాలో కూడా లెక్క ఉంటుంది.

🔸 ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉండవచ్చు. కానీ పూరీకి నాయకుడు మాత్రం జగన్నాథుడే. అందుకు గుర్తుగా పూరీ రాజు, జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందర బంగారు చీపురతో ఊడుస్తాడు.

🔸 మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికే చేరుకుంటాయి. కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు. జగన్నాథుడికి గుండిచా అనే పిన్నిగారు ఉన్నారు. ఆవిడ ఉండే గుడి పూరీ ఆలయానికి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగన్నాథుడు ఓ తొమ్మిదిరోజుల పాటు ఆ ఆలయంలో ఉంటాడు. తిరిగి ఆషాఢమాసంలోని పదోరోజున పూరీ గుడికి చేరుకుంటాడు.

🔸 మన దగ్గర రాములవారి కళ్యాణం రోజు తప్పకుండా వర్షం పడుతుందనే నమ్మకం ఉంది. అలాగే జగన్నాథ రథయాత్రలో కూడా ప్రతిసారీ వర్షం పడటం ఓ విశేషం.

🔸 జగన్నాథుడికి తన గుడిని వదిలి వెళ్లడం ఇష్టం ఉండదేమో! అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు. కొన్ని గంటలపాటు కొన్ని వేలమంది కలిసి లాగితే కానీ రథం కదలడం మొదలవ్వదు.

🔸 జగన్నాథుడు గుండిచా ఆలయం నుంచి తిరిగివచ్చే యాత్రని ‘బహుద యాత్ర’ అంటారు. ఆ యాత్రలో భాగంగా రథాలన్నీ ‘మౌసీ మా’ అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకి ఇష్టమైన ఓ ప్రసాదాన్ని స్వీకరించి బయల్దేరతాయి.

🔸 జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత ‘సునా బేషా’ అనే ఉత్సవం జరుగుతుంది. అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతురన్నమాట! దీనికోసం దాదాపు 208 కిలోల బరువున్న నగలను ఉపయోగిస్తారు.

🔸 కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తుంటారు.

Scroll to Top
Share via
Copy link