ఉండ్రాజవరం బౌద్ధ దమ్మ పీఠంలో గురుపౌర్ణమి సందర్భంగా పీఠాధిపతి బంతే అనాలియో అధ్యక్షతన నిర్వహించిన వనమహోత్సవములో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు రకాల మొక్కలను పంపిణీ చేసి, నూతనంగా నిర్మిస్తున్న బౌద్ధ ఆలయాన్ని పరిశీలించారు, బౌద్ధ ఆశ్రమం పీఠం స్థాపించిన నాటి నుండి నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు, కరోనా సందర్భంగా అందించిన వైద్యసహాయాల ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న బౌద్ధాలయాన్ని, విశిష్టతను, బౌద్ధానికి సంబంధించిన ప్రాముఖ్యతలు పీఠాధిపతి అనాలియోను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ బుద్ధ భగవానుని బోధనలు, ప్రపంచానికి అందించిన శాంతి సూత్రములు తెలియజేస్తూ పంచవర్గీయ భిక్షువులకు బుద్ధుడు మొదటి ప్రవచనం చేసిన రోజు గురు పౌర్ణమి కావటం దానికి గుర్తుగా ఆ రోజును బుద్ధ పౌర్ణమి గా నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, ఎపి పౌల్ట్రీ ఫెడరేషన్ బోర్డు అధ్యక్షులు ఉండ్రాజవరం మాజీ జెడ్పిటిసి కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ బోర్డు సభ్యులు, ఉండ్రాజవరం గ్రామ మాజీ సర్పంచ్ గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం, ఉండ్రాజవరం మండల టిడిపి సీనియర్ నాయకులు కుదప చక్రపాణి, ఉండ్రాజవరం మండల బిజెపి అధ్యక్షులు కొప్పినీడి బాలాజీ, బూరుగుపల్లి కళారావు, తదితరులు పాల్గొన్నారు.
