పార్లమెంటులో ప్రతిపక్ష పాత్ర పోషించిన ప్రాంతీయ పార్టీగా చరిత్ర
*41వ వార్డ్ అధ్యక్షులు ఐయితి. మధుబాబు *
పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ తెలుగు వారి గుండె చప్పుడుగా వార్డు టీడీపీ అధ్యక్షులు ఐయితి మధు బాబు అభివర్ణించారు. 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం జ్ఞానాపురం లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్థాపించిన 9 నెలల్లోనే వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన తెలుగుదేశానికి కార్యకర్తలే వెన్నెముకగా పేర్కొన్నారు. శుభ సూచకంగా భావించే పసుపును పార్టీ రంగుగా మార్చి, కార్మిక, కర్షక, పేద ప్రజలను ప్రతిబింబిస్తూ పార్టీ జెండాలో చక్రం, నాగలి, గుడిసె బొమ్మలను ఎన్టీఆర్ స్వయంగా తయారు చేసుకున్నారని వివరించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, 2 రూపాయలకు కిలో బియ్యం, పక్కా ఇళ్లు వంటి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీని ప్రజలకు చేరువ చేశారని ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్నారు. 1984 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మరణించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 30 సీట్లతో పార్లమెంటులో ప్రతిపక్ష పాత్ర పోషించిన ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలను, సిద్ధాంతాలను కొనసాగించడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తెలుగుదేశాన్ని మరింత బలోపేతం చేస్తున్నారన్నారు. సంక్షేమ నిధితో కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన మంత్రి లోకేష్ చొరవతో కోటికి పైగా సభ్యత్వాల రికార్డు సాధ్యపడిందని చెప్పారు. అంతకుముందు ఐయితి.మధు బాబు, ఐయితి. రవి, ఈరోతి.చిన్ని కలిసి కార్యాలయం ఆవరణలో జెండా ఎగురవేశారు. అనంతరం కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చల్లటి మజ్జిగను 300 మందికి పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్యకర్తలు, నాయకులకు బూత్ ప్రెసిడెంట్ లు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.