మోటార్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, చట్ట ప్రకారం సౌకర్యాలు అమలు జరిగేల కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని మోటార్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్రి నాగేశ్వరావు అన్నారు. గురువారం స్థానిక అమర వీరుల భవనంలో మోటార్ ట్రాన్స్ పోర్ట్ కార్మికులు సమావేశం జరిగింది. ఈ సందర్బంగా నాగేశ్వరావు మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా మోటార్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో కోట్లాది మంది పని చేస్తున్నారన్నారు. ఒక చోటనుండి మరొక చోటికి రవాణా ద్వారా సరుకులు మరియు ప్రయాణికులని ఎంతో క్షేమంగా తీసుకొని వెళుతున్నారని తెలిపారు. అలాంటి డ్రైవర్లు మెడకు ఉరితాడు లాగా ఉన్న 2019 రోడ్ సేఫ్టీ చట్టాన్ని సవరణ చేయాలని డిమాండ్ చేశారు. రవాణా రంగంలో డ్రైవర్స్ కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు పెట్రోల్, డిజిల్ పై ప్రభుత్వ పన్నులు మినహాయింపు ఇవ్వాలని అన్నారు. ఊబర్, ఓలా, ర్యాపిడో లాంటి యాప్‌లకు ప్రత్యామ్నాయం గా కేంద్ర ప్రభుత్వం యాప్ తీసుకు రావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మోటార్ ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు వ్యతిరేక విధానాలు ఆపాలని మార్చి 24 న జరిగే ఛలో ఢిల్లీ పెద్దత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు.CITU జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్ మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని అన్నారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలని తెలిపారు. కార్మికులకు రక్షణగా ఉన్న పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గుబ్బల గోపి, అందే శ్రీనివాస్, చిట్టి బాబు, ప్రసాద్, అమిరుద్దీన్, వంశీ, మురళి తదితరులు పాల్గొన్నారు.
