బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త మత్స్యకార నాయకుడు వాసుపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఆదివారం ఉదయం విశాఖ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సమక్షం లో ఆయన బిజెపి పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వాసుపల్లి సంతోష్ మాట్లాడుతూ బిజెపి పార్టీ లో చేరటం తనకు ఎంతో సంతోషంగా ఉందని , కేంద్రం లో బిజెపి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని 26 సంవత్సరాల తర్వాత 48 సీట్ల మెజారిటీతో ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన అవినీతి కార్యక్రమాల వల్లే ఆ పార్టీ ని ప్రజలు ఆదరించలేదని, అదేవిధంగా బిజెపి అవలంబిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఢిల్లీ ప్రజలు విశ్వాసముంచారన్నారు. కేంద్రం లో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నచ్చడం తోనే బిజెపి పార్టీ లో చేరుతున్నానని ఒక ఆటో డ్రైవర్ కొడుకుగా పుట్టి నా పిల్లల ను అమెరికాలో చదివించే స్థాయికి వచ్చేందుకు ఏవిధంగా కృషి చేశానో , బిజెపి పార్టీ ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తాను బిజెపిలోకి రావటానికి సహకరించిన బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాధ రాజు , బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామ రాజులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాశీ విశ్వనాధ రాజు, బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామ రాజు, బిజెపి జిల్లా కార్యదర్శి దానేశ్, స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ డివిఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
