సముద్రంలోకి వృధాగా పోయే నీటితో రిజర్వాయర్లు, చెరువులు నింపండి
ఆగస్ట్ 31న కుప్పం బ్రాంచ్ కెనాల్ కు హంద్రీనీవా నీళ్లు
ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
అమరావతి, జూలై31: సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు సమర్ధ నీటి నిర్వహణపై జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 771 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే మధ్య స్థాయి ప్రాజెక్టుల్లో 43 టీఎంసీలు, చిన్న నీటి చెరువుల్లో 67 టీఎంసీల మేర నీరు నిల్వ ఉందని తెలిపారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లు, చెరువుల్లో 882 టీఎంసీల మేర నీరు ఉన్నట్టు వివరించారు.