నిడదవోలులో మే 3 న తలపెట్టిన జాబ్ మేళా విదేశీ పర్యటన నేపథ్యంలో వాయిదా – మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు నియోజకవర్గ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం కోసం స్థానిక ఎస్ వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్ మేళా మే 3వ తేదీకి బదులు మే9 కి వాయిదా వేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మే 1 నుండి 6 వ తేదీ వరకు వియత్నాం దేశంలోని హోచిమిన్హ్ నగరంలో జరగబోయే బుద్ధ భగవానుడి అవశేషాల ప్రదర్శనకు భారత దేశం తరపున కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి వెళ్లాలని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) నుండి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని మే 9 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలియ చేశారు. బౌద్ధ ధార్మిక కార్యక్రమ నిర్వహణ బాధ్యతను విజయవంతంగా ముగించుకొని వియత్నాం నుండి తిరిగి భారతదేశానికి రాగానే మెగా జాబ్ మేళా నిర్వహించి 1302 మందికి నిరుద్యోగ యువత ఉద్యోగాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా లో పాల్గొనడం జరుగుతుందని వెల్లడించారు.
మే 9 వ తేదీన నిడదవోలు ఎస్ వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నామని , నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.