21న యోగా దినోత్సవం విజయవంతం చేయాలి

విశాఖలో ప్రధాని మోదీ పాల్గొంటారని వెల్లడి

గాజువాక నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆరిమిల్లి రాధాకృష్ణ

ఈనెల 21న విశాఖపట్టణంలో నిర్వహించనున్న యోగా దినోత్సవం కార్యక్రమాన్ని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదయ్యే విధంగా ప్రతిఒక్కరు సహకరించాలని తణుకు ఎమ్మెల్యే, గాజువాక–2 నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. సోమవారం గాజువాక కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించగా తర్వాతి కాలంలో ఐక్యరాజ్య సమితి కూడా యోగా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించినట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా ఈనెల 21న 11వ పర్యాయం ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్టణం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సహకారంతో నిర్వహించడానికి అన్ని సన్నాహాలు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాల్గొంటున్న ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రజలోల యోగా పట్ల అవగాహన కల్పించి యోగాను ప్రతి ఒక్కరు తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకుని తద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ సాధించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రాచీనమైన యోగాను ప్రజల్లో భాగస్వామ్యం చేసే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి సమాజంలో ఆరోగ్యకవాతావరణం తీసుకువచ్చే విధంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఈనెల 21న యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link