యోగాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలా ప్రతి ఒక్కరిలో అవగాహన
ఈనెల 21న విశాఖలో జరిగే కార్యక్రమంలో పాల్గొసున్న ప్రధాని మోదీ
గాజువాక నియోజకవర్గం ఇంచార్జ్ హోదాలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
ఈనెల 21న విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని తణుకు ఎమ్మెల్యే, గాజువాక నియోజకవర్గం ఇన్ ఛార్జ్ ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఐదు లక్షల మంది పాల్గొనేలా ప్రణాళికలు చేసినట్లు చెప్పారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న యోగా ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం చేసి వారి ఆరోగ్యంతో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. ఐక్యరాజ్య సమితి సైతం యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తించిన తర్వాత 11 వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విశాఖ వేదికగా నిర్వహించుకోవడం అందరి అదృష్టమని చెప్పాలి. యోగా కారణంగా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు అనేక ఆరోగ్య ఫలాలు మనకు అందుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.