ఎమర్జెన్సీని ఎదిరించి ప్రజాస్వామ్యం నిలిచింది
నాడు జనతాపార్టీ విజయానికి, 2019-2024 మధ్యకాల పరిస్థితులను ఎదుర్కొన్న నేటి కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన సారూపత్య ఉంది
గత ప్రభుత్వ దుర్మార్గ పాలన నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన నాయకుడు సీఎం చంద్రనాయుడు
విజయవాడలో జరిగిన “సంవిధాన్ హత్యా దివాస్” 2025 కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
ప్రజాస్వామ్యానికి చీకటియుగంగా నిలిచిన ‘ఎమర్జెన్సీ’కి నేటితో 50 ఏళ్లని,ఎమర్జెన్సీని ఎదిరించి ప్రజాస్వామ్యం నిలిచిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ మరియు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన “సంవిధాన్ హత్యా దివాస్” 2025 కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి చీకటిరోజు.. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అనే నినాదంతో ప్రారంభమైన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించి 50 సంవత్సరాలు కావడంతో నాటి దుర్భర పరిస్థితులను వివరించారు. ఎమర్జెన్సీ కాలం భారత రాజ్యాంగ అమలుకు, రాజ్యాంగ స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగించిందన్నారు. నాడు ఎమర్జెన్సీని ఎదుర్కొని , నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో బలమైన ప్రజా ఉద్యమం ప్రారంభమైందని, ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు జనతాపార్టీ చేసిన కృషిని, పోరాటాన్ని, ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన 1977 ఎన్నికల్లో జనతాపార్టీ విజయాన్ని మంత్రి దుర్గేష్ కళ్లకు కట్టినట్లుగా వివరించారు. ఈ సందర్భంగా నాటి జనతాపార్టీ విజయానికి, 2019-2024 మధ్యకాల పరిస్థితులను ఎదుర్కొన్న నేటి కూటమి ప్రభుత్వానికి ఉన్న సారూపత్యను స్పష్టంగా తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ భవిష్యత్తు ఏ రకంగా ఉండకూడదో అనే అంశంపై ఆలోచించి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమమే సంవిధాన్ హత్యా దివాస్ అన్నారు. నాటి ప్రధానమంత్రి ఎమర్జెన్సీ ప్రకటించడానికి కారణాలు ఏవైనప్పటికీ అధికారకాంక్షతో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పక్కనబెట్టి తానే అధికురాలు అనే భావనతో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయడానికి కారణమయ్యారని నేపథ్యాన్ని మంత్రి దుర్గేష్ వివరించారు. నాడు దుర్మార్గ విధానాలు అవలంభించి ప్రతిపక్ష నేతల గొంతు నులిమేశారని ఆరోపించారు. అన్యాయం అని ఎవరైనా ప్రకటిస్తే వారిని జైల్లో బంధించడం, కనీసం కోర్టుల ద్వారా ఇది తప్పు అని నిర్ధారించుకునే పరిస్థితులు లేకుండా చేశారని గుర్తుచేశారు.ఎవరైనా కేసు పెడితే వెంటనే అరెస్ట్ చేసే పరిస్థితులు కల్పించారన్నారు. న్యాయం కోసం కోర్టులకు వెళ్లకుండా చేశారన్నారు. పత్రికా స్వేచ్ఛను సైతం సంపూర్ణంగా నాశనం చేశారని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఎమర్జెన్సీని ప్రకటించిన సమయంలో పత్రికా ఆఫీసులకు కరెంట్ కోతలు విధించారన్నారు. నాడు ఇండియన్ ఎక్స్ ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి ఆంగ్ల పత్రికలు తమ సంపాదకీయాల ద్వారా ఎమర్జెన్సీని ప్రజాస్వామ్య సంస్మరణ దినోత్సవంగా వర్ణించారని వెల్లడించారు. నాడు జరిగిన అన్యాయాలు, అక్రమాలు, ప్రజల్లో భయాందోళనలు కలిగిన ఘటనలు తరుచూ పుస్తకాల్లో చదువుతూనే ఉంటున్నామన్నారు. అప్పట్లో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ ను సైతం మెయింటెనెన్స్ ఆఫ్ ఇందిరా సంజయ్ యాక్ట్ గా చెప్పేవాళ్లని గుర్తుచేశారు.ఎమర్జెన్సీ వల్ల యువత తీవ్రంగా నష్టపోయిందన్నారు.
ఈ క్రమంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలన్న ఆలోచనతో, ప్రజాస్వామ్యంపై అచంచలమైన విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరూ జనతా పార్టీగా సమీకరించబడి, వీరోచిత ఉద్యమాలు చేసి 1977లో అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారన్నారు. తద్వారా దేశానికి ప్రత్యేక ప్రతిపత్తిని,ఒరవడిని జనతాపార్టీ కల్పించిందన్నారు. అలాంటి అధికారకాంక్షతో చేసే పనిని ఏపీలో 2019-24 మధ్య కాలంలో చూశామన్నారు. ప్రతిపక్షనాయకుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడిని 53 రోజులు జైల్లో పెట్టి గత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిన తీరును చూశామన్నారు. ఆ సందర్భంలోనే ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య విధానాలు రాష్ట్రంలో ముందుకు వెళ్లాలన్న సత్సంకల్పంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడే చారిత్రాత్మక నిర్ణయానికి బీజం పడిందన్నారు.. నాడు ఎలాగైతే వివిధ రాజకీయ విధానాలున్న అన్ని పార్టీలు కలిసి జనతాపార్టీగా సమీకరించడి అధికారంలోకి వచ్చాయో నేడు అదే తరహాలో బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి కూటమిగా ఏర్పడి అరాచక పాలనకు చెక్ పెట్టి ప్రజాస్వామ్యపాలనకు నాంది పలికిందన్నారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినప్పుడు దాన్ని నిలబెట్టేందుకు చేసిన పోరాట ఫలితమే 2024 ఎన్నికలు, అనంతరం వచ్చిన విజయం అని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్య విలువలపట్ల అచంచల విశ్వాసం గల నాయకులుగా మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తూ, ప్రజాస్వామ్య విధానానికి నిలువెత్తు నిదర్శనంగా సీఎం చంద్రబాబునాయుడు నిలుస్తున్నారని తెలిపారు. తాను సీఎం చంద్రబాబునాయుడును గడిచిన సంవత్సరకాలంగా 26 కేబినెట్ సమావేశాలు, అనేక ఎస్ఐపీబీ సమావేశాల్లో దగ్గరగా చూశానని, ఆయన నాయకత్వ పటిమ ఏంటో అర్థమైందన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజాస్వామ్యపాలను ఎలా చేయాలో తరుచూ దిశానిర్దేశం చేస్తారన్నారు.రాజకీయాల్లో ఉంటే ప్రజాస్వామ్య విధానాల్లోనే ముందుకు వెళ్లాలనడానికి నిలువెత్తు నిదర్శనం సీఎం చంద్రబాబునాయుడు అని మంత్రి దుర్గేష్ అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల చంద్రబాబునాయుడికి అమోఘమైన నిబద్ధత ఉందన్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ పరిణితి, రాజకీయ విధానాలను చూసి చాలా నేర్చుకోవచ్చన్నారు. ఎవరైనా తనను ఎంత రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి హద్దు మీరి మాట్లాడని నేత చంద్రబాబునాయుడు అని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా నేటి యువత గతంలో జరిగిన తప్పులు తెలుసుకొని సమాజం మార్పుకోసం సుశిక్షితులైన సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు.