తణుకులో రోటరీ పీస్ టవర్ ఏర్పాటు
ఆవిష్కరించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
ప్రపంచ దేశాల్లో అశాంతి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఆయా దేశాలకు సంబంధించి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. తణుకు పట్టణంలోని నరేంద్ర సెంటర్ వద్ద రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ పీస్ టవర్ ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఉగ్రవాదుల దాడులు, విచ్ఛిన్నకర శక్తులు సృష్టిస్తున్న అలజడులు నేపథ్యంలో యుద్ధ వాతావరణం నెలకొందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో శాంతి కోల్పోయి ఒక అలజడి భావం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పీస్ టవర్లు ఏర్పాటు చేసి ప్రపంచ శాంతిని వర్ధిల్లాలి అనే ఉద్దేశంతో ప్రజల మధ్య రాష్ట్రాల మధ్య దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రపంచ దేశాల్లో సోదర భావం ఏర్పడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.