రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలి
అత్తిలిలో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారంతో గ్రామస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. అత్తిలి మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం మండలంలోని వైద్య ఆరోగ్య శాఖతోపాటు పంచాయతీరాజ్, పారిశుద్ధ్య సిబ్బందితో ఎమ్మెల్యే రాధాకృష్ణ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాబోయే వర్షాకాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వ్యాధులు ప్రబలకుండా ప్రభావాన్ని తగ్గించి పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అందరినీ సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యాన్ని కాపాడే విధంగా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. చికెన్ గున్యా, మలేరియా, డెంగీ ఇతర విష జ్వరాలు ప్రబలకుండానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు శాఖల వారీగా అధికారులు, సిబ్బంది తీసుకోవలసిన బాధ్యతలను ఆయన గుర్తు చేశారు. రాబోయే ఆరు నెలల పాటు సమన్వయంతో పని చేయడం ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడగలిగేవారం అవుతామని అన్నారు. గ్రామపంచాయతీలో కార్యదర్శులు పారిశుధ్యం పై దృష్టి పెట్టాలని, ఇంటింటికి చెత్త సేకరణ పై నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రాబోయే ఆరు నెలలపాటు ప్రతి 14 రోజులకోసారి గ్రామాల్లో యాంటీ లార్వా స్ప్రేయింగ్ కచ్చితంగా జరగాలని సంబంధిత సిబ్బందిని కోరారు. పైపులైను లీకేజీలతోపాటు వాటర్ ట్యాంకుల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో నిధులకు సంబంధించి ఇబ్బందులు ఎదురైతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. మండలంలో ఆరు నెలల పాటు ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మండల పరిషత్ అధ్యక్షులు మక్కా సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, వివిధ శాఖల అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.