నిడదవోలు-నరసాపురం ప్రధాన రహదారిపై జరుగుతున్న కల్వర్టు పనుల పరిశీలన
నడిపల్లికోట వెళ్లే రోడ్డుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ
మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిడదవోలు-నరసాపురం ప్రధాన రహదారిపై జరుగుతున్న కల్వర్టు పనులను స్వయంగా పరిశీలించారు. స్థానిక ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కల్వర్టు పనుల పురోగతిపై ఆరా తీశారు. ప్రయాణీకులు, వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రజల విజ్ఞప్తి మేరకు కొండాలమ్మ దేవాలయం సమీపంలోని నడిపల్లి నుండి నడిపల్లికోట వెళ్లే రోడ్డు అధ్వాన్న దశకు చేరడంతో తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కొంత దూరం ప్రజలతో కలిసి మంత్రి దుర్గేష్ రోడ్డుపై నడిచారు. పనులు శరవేగంగా పూర్తి చేస్తామని, మరికొన్ని రోజులు ప్రయాణికులు సహకరించాలని మంత్రి దుర్గేష్ కోరారు. రహదారుల పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం ఒక్క రోడ్డు కూడా వేయలేదని,కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అంతర్గత రహదారులతో పాటు ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి చూపించామన్నారు.ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ ప్రజలను కోరారు.