మెప్మాలో పౌర సేవలు సత్వరం అందించేందుకు డిజిటల్ విధానానికి శ్రీకారం

మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా నిడదవోలు పురపాలక సంఘంలో పనిచేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు పంపిణీ

సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆర్పీలకు సూచన

రిసోర్స్ పర్సన్స్ కు పనిభారం, సమయాభావం తగ్గించాలనే ఉద్దేశంతో ట్యాబుల పంపిణీ

ప్రతి ఒక్క రిసోర్స్ పర్సన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన

మెప్మా, డ్వాక్రాలు సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రికలు అని మంత్రి దుర్గేష్ వెల్లడి

డిజిటల్ విధానంతో మెప్మాలో సేవలు మరింత పారదర్శకంగా అందుతాయన్న మంత్రి దుర్గేష్

నిడదవోలు : కార్పొరేషన్ లు, మున్సిపాలిటీల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు త్వరితగతిన సేవలు అందించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) లో డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.బుధవారం నిడదవోలు క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు స్థానిక పురపాలక సంఘంలో పనిచేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్ లకు మంత్రి కందుల దుర్గేష్ తన చేతుల మీదుగా ట్యాబ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రిసోర్స్ పర్సన్స్ కు పనిభారం, సమయాభావం తగ్గించాలనే ఉద్దేశంతో ట్యాబులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని ట్యాబ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పౌరులు తమకు కావాల్సిన మున్సిపల్, ఇతరత్రా సేవలను అడిగితే త్వరితగతిన అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తద్వారా ప్రజల చేతిలోనే ప్రభుత్వం ఉంటుందన్నారు.త్వరలోనే ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ తీసుకొస్తున్నామన్నారు. ఇప్పటికే ట్యాబ్ ల ద్వారా ఆన్ లైన్ నమోదు,అవగాహన కల్పించే ఉద్దేశంతో శిక్షణ అందించామని తెలిపారు.ప్రజానీకానికి మరింత త్వరగా సేవలు అందించాలని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ రిసోర్స్ పర్సన్ లకు సూచించారు.మెప్మా, డ్వాక్రాలు సీఎం నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రికలు అని ఈ సందర్భంగా అభివర్ణించారు. మహిళల సంక్షేమానికి, సాధికారతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ డిజిటల్ విధానంతో మెప్మాలో సేవలు మరింత పారదర్శకంగా అందుతాయని పేర్కొన్నారు.

Scroll to Top
Share via
Copy link