మొదటి ఏడాదిలోనే 5.50 లక్షల ఉద్యోగాలు కల్పనకు కృషి
ఈనెల 13న తణుకులో మెగా జాబ్ మేళా నిర్వహణ
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరుమెల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మొదటి ఏడాదిలోనే దాదాపు రూ. 9.50 లక్షల కోట్లు పెట్టుబడితో సుమారు 5.50 లక్షలు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఆదివారం తణుకులోని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలోనే పెట్టుబడును సాధించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు భారీ స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు రావడం విశేషమని అన్నారు. యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలో భాగంగా యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో మొదటి ఏడాదిలోనే దాదాపు 5.30 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని చెప్పారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాల్లో అనేక పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. ఇందుకు అనుగుణంగానే తణుకు నియోజకవర్గంలోనే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 13న తణుకులో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తణుకు మహిళా కళాశాల ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ మెగా మేళాలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఫార్మా నిర్మాణ ఐటి ఎలక్ట్రానిక్స్ బ్యాంకింగ్ వంటి సుమారు 50 పైగా కంపెనీలు పాల్గొనబోతున్నాయని చెప్పారు. ఈ మేళాలో పదో తరగతి నుంచి ఇంటర్, ఐటిఐ, డిప్లమా, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ వంటి అర్హతలు కలిగిన అభ్యర్థులు హాజరు కావచ్చని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇందుకోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తో పాటు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.