ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు
వరిఘేడులో కళావేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే
ఎంత ఆస్తులు సంపాదించినప్పటికీ సమాజం కోసం ఎంతో కొంత ఖర్చు పెడుతూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రతి ఒక్కరు దాతృత్వాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం వరిఘేడు గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు రూ. 6 లక్షల వ్యయంతో గ్రామానికి చెందిన అడ్డాల కృష్ణారావు, అనంతలక్ష్మి దంపతుల కుమారులు నిర్మించిన కళావేదిక ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. స్థానికంగా ఉంటూ విదేశాల్లో స్థిరపడినప్పటికీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్థానికంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కళావేదిక నిర్మించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే దాతృత్వంతో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జన్మభూమి కార్యక్రమం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. ఆనాడు ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి జన్మభూమి కార్యక్రమానికి సహకారం అందించారని అన్నారు. అదే స్ఫూర్తితో తిరిగి చంద్రబాబు నాయుడు పి4 విధానాన్ని అమలులోకి తీసుకువచ్చి దాతలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ అనేక సంస్కరణలో తీసుకువచ్చి ప్రతి మండలంలో మోడల్ స్కూల్స్ నిర్మించారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు చొరవ చూపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా తల్లిదండ్రుల కమిటీ, విద్యా కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.