పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రంలో తణుకు మూడోస్థానం

పారిశుద్ధ్యం నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో రాష్ట్రస్థాయిలోనే తణుకు పట్టణం మూడో స్థానంలో నిలిచిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టి, దోమల నివారణకు కృషి చేసి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం తణుకు పట్టణంలోని 2, 4 వార్డుల్లో ఇంటింటికీ పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాదిగా అందుతున్న సంక్షేమం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశుద్ధ్య నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేశారని అన్నారు. పట్టణాల్లో చెత్తను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజమండ్రిలో త్వరలో నిర్మించబోయే వేస్ట్‌ ఎనర్జీ ప్లాంటు నిర్మించి స్థానికంగా ఉత్పత్తి అవుతున్న చెత్తను అక్కడికి తరలించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో రేషన్‌ పంపిణీ విధానంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం తిరిగి రేషన్‌ షాపులను పునరుద్ధరించి 15 రోజుల పాటు ఎప్పుడు వీలుంటే అప్పుడు రేషన్‌ తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. అసలైన సంక్షేమాన్ని అందిస్తున్న కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link