:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ఆగస్టు 2న అర్హులైన రైతన్నల ఖాతాల్లో పెట్టుబడి సాయంగా తొలి విడతగా రూ.7000 జమ.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5 వేలు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2వేలు అని పేర్కొన్న మంత్రి దుర్గేష్
నిడదవోలు నియోజకవర్గంలో 19317 మంది అర్హులైన రైతన్నల ఖాతాల్లో రూ.13.52 కోట్ల నిధులు జమ చేస్తున్నామని వెల్లడి
మొత్తం మూడు విడతల్లో రైతన్నల ఖాతాల్లో రూ.20000 లబ్ధి.. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.14,000, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.6000
రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, ఇది రైతుల బాగు కోరే మంచి ప్రభుత్వమని పేర్కొన్న మంత్రి దుర్గేష్
సీఎం సూచనల మేరకు నిధుల విడుదల సందర్భంగా ప్రతి రైతు సేవా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం
నిడదవోలు: సూపర్ సిక్స్ హామీల్లో మరో హామీని అమలు చేస్తూ ఆగస్టు 2న(రేపు) తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని అర్హులైన 19317 మంది రైతన్నల ఖాతాల్లో పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన క్రింద తొలివిడతగా రూ.13.52 కోట్ల నిధులు నేరుగా జమ చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేపు అర్హులైన ప్రతి రైతన్న బ్యాంకు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వ వాటాగా 2 వేలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేల రూపాయలను నేరుగా జమ చేయనున్నట్లు మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. అందులో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు రూరల్ మండలంలో 7731 మంది రైతులకు రూ.5.41 కోట్లు, పెరవలి మండలంలో 7022 మంది రైతులకు రూ.4.91 కోట్లు, ఉండ్రాజవరం మండలంలో 4564 మంది అర్హులైన రైతన్నలకు రూ.3.19 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నామన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.9.65 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.3.8 కోట్లని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన పథకం క్రింద ఏటా మూడు విడతల్లో రూ.20000 ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసి చూపిస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. అందులో భాగంగా తొలివిడతగా కేంద్రం 2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేల రూపాయలను రేపు నేరుగా రైతన్నల బ్యాంకు ఖాతాకు జమ చేయనున్నట్లు మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రెండో విడతగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.5వేలు, కేంద్రం రూ.2 వేలు, మూడో విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేలు, కేంద్రం రూ.2 వేలు మొత్తంగా ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన క్రింద అర్హులైన ప్రతి రైతన్నకు రూ.20,000 సాయం అందించనున్నాయని పేర్కొన్నారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.14వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు అందించనుందని వివరించారు.
రైతులకు ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామని, ఇది ప్రజలకు మంచి చేసే ప్రభుత్వమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతన్నల ఖాతాల్లో నిధుల వరద పారనుందన్నారు. రైతులు తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. సీఎం చంద్రబాబునాయుడు సూచనల మేరకు నిధుల విడుదల సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ప్రతి రైతు సేవా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ అర్హులై ఉండి నగదు జమ కాని రైతులెవరైనా ఉంటే ఆందోళన అవసరం లేదని నిధుల జమ విషయంలో ఏమైనా సందేశాలు, సమస్యలు ఉంటే 155251 కాల్ సెంటర్ కు లేదా 9552300003 వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ కు ఫోన్ చేయాలన్నారు. స్థానిక రైతు సేవా కేంద్రాలను సంప్రదించవచ్చని మంత్రి కందుల దుర్గేష్, స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.