గత వైసీపీ హయాంలో సహకార వ్యవస్థ నిర్వీర్యం
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు
కొత్తపాడు సొసైటీ నూతన కమిటీ ప్రమాణస్వీకారం
రైతుల సంక్షేమంతోపాటు వారి అభివృద్ధికి వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యంగా సొసైటీలు ఆర్థికాభివృద్ధి సాధించడం ద్వారానే ఆయా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఇరగవరం మండలం కొత్తపాడు సొసైటీ త్రిసభ్య కమిటీ నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసి అనేక సొసైటీల్లో అవకతవకలు చేసి బ్రష్టు పట్టించారని అరోపించారు. లాభాల్లో ఉన్న సొసైటీలను సైతం నష్టాల్లోకి నెట్టివేసి సొసైటీల్లోని నిధులను ఇతర మార్గాల ద్వారా మళ్లించి ఆర్ధికంగా బలహీనం చేశారన్నారు. రైతులకు సంబంధించిన రుణాలను సైతం వైసీపీ నాయకులు వారి స్వప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు. సొసైటీలు పరిపుష్టిగా ఉండే విధంగా వాటిని బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు సమన్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వంలో వారికి గుర్తింపు ఇచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్లు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలు కోసం వారి అభివృద్ధి కోసం నూతన కమిటీ పని చేయాలని కోరారు. సొసైటీ పరిధిలో సుమారు వెయ్యి మంది సభ్యులు ఉంటే వీరిలో 588 మంది రైతులు రుణాలు తీసుకుంటున్నారని చెప్పారు. దాదాపు 80 ఏళ్లు క్రితం స్థాపించిన కొత్తపాడు సొసైటీను ఎంతో మంది ఉద్దండులు ముందుకు నడిపించారని అన్నారు. సొసైటీ వ్యవస్థాప అధ్యక్షలుగా పని చేసిన సుబ్బరాజు సొసైటీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. భవిష్యత్తులో సొసైటీను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా రాజకీయంగా ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ సహకారంతో సొసైటీ పాలకవర్గం రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సొసైటీ ఛైర్మన్ కారెం బాబురావుతోపాటు డైరెక్టర్లను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.