త్వరలో మెగా డీఎస్సీ నిర్వహించేందుకు చర్యలు అత్తిలి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ
రాబోయే అయిదేళ్లలో నిరుద్యోగులకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కృషి చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోరుతూ బుధవారం అత్తిలి మండల కేంద్రంలో ఆయన పర్యటించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ఎనిమిది నెలల్లో రూ. 5 లక్షల కోట్లు పెట్టుబడితో 54.70 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం సాధించిన విజయం అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రత్యేకంగా సీడ్ యాప్‌ను ప్రవేశపెట్టి యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నారని అన్నారు. డిగ్రీలు చేసిన యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీడ్ యాప్‌లో యువత రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా వారికి ఉద్యోగాల కల్పన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించడానికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకున్నవారంతా ఈనెల 27న నిర్వహించనున్న ఎన్నికల్లో కూటమి బలపరచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో కొనసాగుతోందని ఎక్కడికి వెళ్లినా ప్రజలే చెబుతున్నారని అన్నారు. వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రశంసిస్తూ తప్పనిసరిగా ఓట్లు వేస్తామని ప్రజలు చెబుతుండటం శుభపరిణామం అన్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుండటంతో ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. కేంద్రప్రభుత్వం ఇస్తున్న సహకారం పట్ల ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.