చలువతోట ప్రాంతంలో ఎస్ కె ఎం ఎల్ ఎంటర్ప్రైజెస్ గుట్కాల, కైనీల అక్రమ వ్యాపారం చేస్తూ, కులం పేరుతో స్థానిక దళిత మహిళలను వేధిస్తున్న వ్యాపారి కొండలరావు పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పోరేటర్ డాక్టర్ కందుల నాగరాజు డిమాండ్ చేశారు. గోకుల్ థియేటర్ వెనక చలువతోట ప్రాంతంలో ఎస్.కె.ఎం.ఎల్. ఎంటర్ప్రైజెస్ పేరున గుట్కా, కైనీల అక్రమ వ్యాపారం చేస్తున్న కొండలరావు అనే వ్యక్తి తన షాప్ ముందు నుంచి దళితులెవ్వరు వెళ్ళకూడదని అడ్డంగా గీత గీయడమే కాకుండా బహిరంగంగా అందరకు చెప్పడం జరిగింది. స్థానిక మహిళలు అతని నిర్వాకంపై మండిపడి అతనిని గట్టిగా నిలదీశారు. అయినప్పటికీ కొండలరావు ఎక్కడ తగ్గకుండా స్థానిక మహిళలను కించపరుస్తూ వారితో గొడవ పెట్టుకున్నాడు. ఇక చేసేది లేక మహిళలు అందరు కలిసి స్థానిక 32 వ వార్డు కార్పొరేటర్ అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ కందుల నాగరాజుకు మొరపెట్టుకున్నారు. ప్రజల తరఫున డాక్టర్ కందుల నాగరాజు ఇదే విషయంపై కొండలరావును గట్టిగా నిలదీయడం జరిగింది. స్థానిక మహిళలను కులాల పేరిట దూషించడం సరికాదు అంటూ హితవు పలికారు. మనుషులందరినీ సమానంగా చూడాలని కులాల పేరున విడదీసి అవమానించకూడదు అంటూ గట్టిగా చెప్పారు. తన తప్పు తెలుసుకుని చేసిన పొరపాటున సరిదిద్దుకోవాలని, లేదంటే పోలీసులను ఆశ్రయించ వలసి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా అక్కడ మహిళలు నిర్వహించిన ధర్నాకు డాక్టర్ కందుల నాగరాజు తన మద్దతు తెలిపారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐకు ఈ విషయమై ఫిర్యాదు చేసి కొండలరావు పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొండలరావుని పిలిపించి ఈ సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తానని సిఐ డాక్టర్ కందుల నాగరాజుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బుజ్జి, సన్యాసిరావు, సూరిబాబు, కిషోర్, అప్పారావు, జ్యోతి, రవణమ్మ, లక్ష్మి, సత్యనారాయణ దుర్గమ్మ, భాను ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
