వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విశాఖ దక్షిణ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గురువారం భేటీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ కార్యక్రమాల నిమిత్తం ట్రాన్సిట్ హాల్ట్పై విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికొచ్చిన జగన్ను వాసుపల్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ అభివృద్ధిపై వీరిద్దరి మధ్య కాసేపు చర్చ సాగింది. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరడం లేదని వాసుపల్లి తెలియజేయగా, వైసీపీ తరఫున ఆ బాధ్యతను పార్టీ కార్యకర్తలంతా పోరాడి ప్రజలకు సేవ చేయాలని జగన్ సూచించారు. అలాగే దక్షిణ నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న సమస్యలు, మత్స్యకారులకు అందాల్సిన భరోసా వివిధ సమస్యలను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న నేతల్ని కార్యకర్తలను గుర్తించి నూతనంగా పలు అనుబంధ సంఘాల బాధ్యతలు పార్టీ అందజేయడంతో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారని జగన్ దృష్టికి వాసుపల్లి గణేష్ కుమార్ తీసుకువెళ్లారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏ వర్గానికి కూడా ఇప్పటివరకు న్యాయం చేయలేదని దుయ్యబట్టారు. పైగా నాడు వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పాలన పూర్తిగా కనుమరుగయ్యేలా కూటమి ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలకు ప్రజలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రజల తరఫున వైసిపి ప్రభుత్వం ఇప్పుడు అండగా ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో దక్షిణ నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని వాసుపల్లి గణేష్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు.
