మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు (86) బుధవారం కన్నమూశారు. గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధ పడుతున్న వెంకటేశ్వరరావు తణుకులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తణుకులోని చిట్టూరి వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 1983లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అప్పట్లో తణుకు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. గ్రామాల్లో రోడ్లు అభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరు చేయించడంలో తన వంతు కృషి చేశారన్నారు. మరోవైపు లయన్స్‌ క్లబ్‌ ద్వారా సుదీర్ఘకాలం సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. వెంకటేశ్వరరావు తండ్రి చిట్టూరి ఇంద్రయ్య 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాపార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన చిట్టూరి ఇంద్రయ్య గెలుపొందారని గుర్తుచేశారు. వెంకటేశ్వరరావు సోదరుడు చిట్టూరి బాపినీడు సైతం 2004లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారని అన్నారు. తండ్రి పేరుతో శ్రీ చిట్టూరి ఇంద్రయ్యమెమోరియల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 1968లో స్థాపించి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు.

Scroll to Top
Share via
Copy link