తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
హౌసింగ్ బోర్డు నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యం(పీ4)తో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. వచ్చే ఉగాది నుంచి ప్రభుత్వం ఈ విధానం అమల్లోకి తీసుకువస్తోందని చెప్పారు. తణుకు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. కేవలం పదవులు అలంకారప్రాయం కాకుండా కాలనీ అభవృద్ధికి కృషి చేస్తున్న పాలకవర్గాన్ని ఆయన అభినందించారు. 2047 విజన్‌కు అనుగుణంగా పీ4 విధానంలో దాతలు, ప్రభుత్వం సహకారంతోపాటు ప్రజల శ్రమదానంతో అభివృద్ధి పనులు చేపట్టేందకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇలాంటి పనులు ఏమైనా ఉంటే వాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. హౌసింగ్‌బోర్డు కాలనీకు గత కొన్నేళ్లుగా పాలకవర్గాన్ని నియమించుకుని సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. కాలనీ అభివృద్ధితోపాటు కాలనీవాసుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి పురపాలక సంఘం నుంచి సహాయ సహకారాలు అందజేస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు. శివాలయం వంతెన నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ వరకు బండ్ రోడ్డు అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. హౌసింగ్ బోర్డు నూతన పాలకవర్గం అధ్యక్షులుగా రాంబాబు, ఉపాధ్యక్షులు ప్రసాదరెడ్డి, సత్యసాయి ప్రసాదరెడ్డి, గూడూరి సత్యనారాయణతోపాటు మిగిలిన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం వెంకశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పూర్వపు పాలకవర్గం సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.