పార్టీకు చెక్కుచెదరని వ్యవస్థాగత నిర్మాణం కార్యకర్తలే – ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం
రాష్ట్రంలో రాజకీయ సంస్కరణలకు నాంది పలికిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా అనేక సంస్కరణలతో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా కృషి చేస్తోందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, వివిధ పథకాలను మహిళలకు అమలు చేసి వారికి రాజ్యాధికారం కల్పించింది తెలుగు దేశం పార్టీ అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తణుకు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. కాంగ్రెస్పార్టీ తెలుగువారిని అవమానాలకు గురి చేయడంతో ఆత్మగౌరవ నినాదంతో స్వర్గీయ నందమూరి తారకరామరావు కేవలం 9 నెలల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి అప్పటి వరకు ఉన్న పెత్తందారీ వ్యవస్థలను అధిగమించి తెలుగుదేశం పార్టీ ద్వారా పేద , బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకువచ్చేందుకు కృషి చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనంతరం ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అనేక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకమారావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ అని బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. భవిష్యత్తు, భావితరాల కోసం విజన్ పరిపాలనతో నాంది పలికి విజన్ అమలయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుందన్నారు. అప్పట్లో నందమూరి తారకమారావు, ప్రస్తుతం నారా చంద్రబాబునాయుడు ఇద్దరూ బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తూ తెలుగువారికి ప్రజాసంక్షేమాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఎప్పుడు ఉన్నా అప్పట్లో విజన్ 2020, ఇప్పుడు విజన్ 2047 ఇలా తెలుగుదేశం పార్టీ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి స్పష్టమవుతోందని చెప్పారు. తెలుగుదేశం పార్టీకు కంచుకోటగా చెక్కుచెదరని వ్యవస్థాగత నిర్మాణం కేవలం కార్యకర్తలే అన్నారు. 43 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల కోసం పోరాడుతోందంటే అందుకు కారణం కార్యకర్తలేనని పేర్కొన్నారు. కార్యకర్తలను దుండగులు మెడ కోసి చంపుతున్నా జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు విడిచే కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. పార్టీలో కార్యకర్తల పాత్ర అమోఘమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తే అధినేత అనే కార్యక్రమాలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దేశంలో ఏ రాజకీయ పార్టీకు లేని విధంగా కోటి సభ్యత్వాలు చేసిన పార్టీ ఏకైక పార్టీ అన్నారు. తణుకు నియోజకవర్గంలో సైతం దాదాపు 65 వేల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని గుర్తు చేశారు. పేదరికం గెలిచే విధంగా పీ4 విధానంలో అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళిక ప్రకారం తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. అనంతరం కేకు కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంచారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ బసవా రామకృష్ణ, చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వావిలాల సరళాదేవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.