ఏలేటిపాడు సొసైటీను బ్రష్టు పట్టించిన గత పాలకులు – ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
రైతు పక్షపాతిగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. 20 వేలు ఈ ఏడాది నుంచే అందజేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. ఇరగవరం మండలం ఏలేటిపాడు సహకార పరపతి సంఘంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ఏలేటిపాడు సొసైటీ ద్వారా అనేక వ్యాపారాలు, కార్యకలాపాలు నిర్వహిస్తూ రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సొసైటీ ముందుకు వెళుతోందన్నారు. గత పాలకులు ఏలేటిపాడు సొసైటీను అడ్డు పెట్టుకుని బ్రష్టు పట్టించేవిధంగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. సొసైటీకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం ధాన్యం సేకరించి 48 గంటల్లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే విధంగా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి ముఖ్యంగా ధాన్యం సేకరణలో ఇబ్బందులను తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పారు. రైతు తనకు నచ్చిన రైసు మిల్లులో విక్రయించుకునే విధంగా వెసులుబాటు ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో తేమశాతానికి సంబంధించి కిలోల లెక్కన తరుగు చూపించి రైతులను నానా ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పవర్టిల్లర్లతోపాటు వ్యవసాయ పనిముట్లు రైతులకు అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. అన్నదాత కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో రూ. 20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసే విధంగా బడ్జెట్లో రూపొందించడం జరిగిందన్నారు. ఏలేటిపాడు, పేకేరు, అయితంపూడి గ్రామాలకు చెందిన రైతుల శ్రేయస్సును కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గత అయిదేళ్ల కాలంలో కాల్వల్లో కనీసం తూడు సైతం తీయలేని పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.