కార్యకర్తలు, నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలి
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు
తణుకు పట్టణ, రూరల్ నూతన కమిటీల నియామకం
తెలుగుదేశం పార్టీను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం తణుకులోని ఎమ్మెల్యే కార్యాలయంలో తణుకు పట్టణంతోపాటు, తణుకు మండలం టిడిపి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకుని వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ పార్టీ కోసం మరింత కష్టపడుతూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పారు. తణుకు నియోజకవర్గ పరిశీలకులు చుండ్రు శ్రీవరప్రకాష్ ఆధ్వర్యంలో తణుకు పట్టణ అధ్యక్షులుగా మంత్రిరావు వెంకటరత్నం, కార్యదర్శి జక్కంశెట్టి వెంకటేష్‌లను ఎన్నుకున్నారు. తణుకు మండలం అధ్యక్షులుగా ఆత్మకూరి రామకృష్ణ, కార్యదర్శిగా దిడ్ల రవికుమార్‌లు ఎన్నికయ్యారు. వీరిని ఎమ్మెల్యే రాధాకృష్ణతోపాటు నాయకులు అభినందించారు.