ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా చంద్రబాబు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
35 మందికి రూ. 25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా వైద్యసహాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేసి ఆదుకుంటున్నారని అన్నారు. శుక్రవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బాధితులకు చెక్కులను అందజేసి మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలోని 35 మందికి రూ. 25 లక్షలు మేర చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా ఉంటానని గతంలో చెప్పినట్లుగా సంక్షేమాన్ని అందిస్తూ మరోపక్క వైద్య ఖర్చుల నిమిత్తం రీఎంబర్స్మెంట్ అందిస్తూ ప్రతి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిపోకుండా ఆదుకుంటున్నారని చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకుంటే కనీసం దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉండేదన్నారు. అలాంటి దరఖాస్తులను కూడా పరిష్కరించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిఒక్కరిని ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.