ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
కొమరవరంలో రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం తణుకు మండలం కొమరవరం గ్రామంలోని లక్ష్మీగణపతి నగర్లో రూ. 37 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన రోడ్డునిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం రూ. 15 లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు. కొమరవరం గ్రామంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లలో రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో స్థానికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. కాలనీలో దాదాపు 14 కిలోమీటర్లు మేర రోడ్లు నిర్మించినప్పటికీ అభివృద్ధి చేయకపోవడంతో గత అయిదేళ్లలో ఎలాంటి మరమ్మతులు చేయలేదన్నారు. రాబోయే రోజుల్లో కొమరవరం గ్రామానికి జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయిలు అందిచడంతోపాటు కొమరవరం, గోపాలపురం గ్రామాల్లో సైతం రెండు వాటర్ ట్యాంకులు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. నిధుల సమస్యతోపాటు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.