ఉండ్రాజవరం గ్రామంలో ఇటీవల మృతి చెందిన జన సైనికుని కుటుంబ సభ్యుల పరామర్శకు విచ్చేసిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం గ్రామంలో పర్యటించి స్థానిక ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన నాయకులు కార్యకర్తలు ఆయన వెంట పర్యటనలో పాల్గొని స్థానిక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న రామాలయం ఆవరణలో మంత్రి దుర్గేష్ స్థానిక జనసేన నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి చర్చించారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు హనుమంతు వెంకన్న మాట్లాడుతూ అద్భుతమైన విజయం సాధించి పరిపాలన చేపట్టిన కూటమి ప్రభుత్వంలో ఉన్న తర్వాత నిడదవోలు నియోజకవర్గంలో ఉండ్రాజవరం గ్రామంలో జనసేన పార్టీ కోసం గెలుపు కోసం శ్రమించిన తమకు కార్యకర్తల నుండి, స్థానిక ప్రజల నుండి వ్యతిరేకత చూడాల్సి వస్తుందని, మంత్రి గారి నియోజకవర్గం అయి ఉండి కూడా ప్రజలు కార్యకర్తలు కోరిన చిన్న చిన్న పనులను కూడా చేయించలేని పరిస్థితిలో ఉండ్రాజవరం జనసేన పార్టీ ఉందని నాయకులు వాపోయారు. జనసేన పార్టీకి చెందిన నాయకులకు సముచిత స్థానం లేదని, అధికారుల వద్ద నుండి కూడా స్పందన కనిపించడం లేదని తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అధికారం ఉండి కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉండ్రాజవరం జనసేన పార్టీ నాయకుల పరిస్థితి ఉందని వాపోయారు. ఈ సందర్భంగా సుమారు గంటసేపు పార్టీ నాయకుల సమస్యలు ఓపికగా విన్న మంత్రివర్యులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా జనసైనికులతో సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
