అల్లూరి సీతారామరాజు 128 వ జయంతి సందర్భంగా తణుకులో సీపీఐ నివాళులు…
స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటపటిమ, ఉద్యమ స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు.మన్యం విప్లవవీరుడు అల్లూరి 128 వ జయంతి సందర్భంగా శుక్రవారం తణుకు వీరనారాయణ ధియేటర్ సెంటర్లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సీపీఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ దేశంలో బ్రిటిష్ వలసపాలన అంతానికి దేశ స్వాతంత్ర్య సముపార్జనకు మొక్కవోని దీక్షతో ఎనలేని ధైర్యసాహసాలతో పోరాడి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. చింతపల్లి, నర్శీపట్టణం,విశాఖ మన్యం ప్రాంతాల్లో అమాయక గిరిజనులను దోచుకుంటున్న బ్రిటీష్ అధికారుల అరాచకాలకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్య పరచి వారికి యుద్ధ విద్యలు నేర్పించి గెరిల్లా యుద్ధపద్ధతుల్లో బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు సాగించిన విప్లవయోధుడు అల్లూరి అన్నారు. బ్రిటిష్ పాలన అంతం కావాలని తదనంతరం దేశంలో పేదరికం, దారిద్య్రం,దోపిడీ, అసమానతలు లేని స్వపరిపాలన కాంక్షతో 27 ఏళ్ళ వయస్సులోనే తన ప్రాణాలను బ్రిటిష్ తుపాకీ గుళ్ళకు అర్పించారన్నారు.దేశానికి స్వాతంత్య్రం లభించి 78 ఏళ్ళు నిండినా అల్లూరి లాంటి విప్లవ వీరులు కలలుగన్న సమాజ స్థాపన జరుగక పోవడం దేశంలో ఇంకా పేదరికం, దారిద్య్రం,సామాజిక అసమానతలు కొనసాగడం పాలకుల స్వార్థ పూరిత, అవినీతి పాలనేనన్నారు.కగార్ ఆఫరేషన్ పేరుతో చత్తీస్ గఢ్, ఒరిస్సా తదితర ప్రాంతాల్లో నక్సలైట్ల ఏరివేత పేరుతో ఆదివాసీ అమాయక గిరిజనులను తీవ్ర నిర్భంధాలకు అణచివేతకు గురిచేస్తూ హతమారుస్తున్నారన్నారు.ఇది అల్లూరి స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అల్లూరి ఆశించిన సమాజ స్థాపనకు పూనుకోవడమే మనం అల్లూరికి అర్పించే నిజమైన నివాళి అంటూ భీమారావు పేర్కొన్నారు.
ప్రముఖ కవి వీయస్వీ ప్రసాద్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వలస పాలన అంతానికి, మన్యం ప్రాంత గిరిజనుల హక్కుల కోసం సాగించిన పోరాటం అనన్యసామాన్యం, అనితర సాధ్యమన్నారు. మన్యం విప్లవ వీరుడుగా గిరిజనుల్లో ఎనలేని కీర్తి నార్జించారన్నారు.
సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి,పట్టణ కమిటీ సభ్యులు గుబ్బల వెంకటేశ్వరరావు,బండి సత్యనారాయణ,బొద్దాని మురళి,నూనె రాధాకృష్ణ,బొద్దాని కృష్ణ కిషోర్ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.