రాబోయే 15 ఏళ్లపాటు అధికారంలో కూటమి
అభివృద్ధి నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వం
ఇరగవరం, తణుకు మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే
‘సుపరిపాలనలో తొలిఅడుగు’లో ఎమ్మెల్యే రాధాకృష్ణ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం, అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు, కె.ఇల్లిందలపర్రు గ్రామాలతోపాటు తణుకు మండలం కొమరవరం, తేతలి గ్రామాల్లో సోమవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అందుతున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకున్నారు. గత వైసీపీ పరిపాలనలో రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సారధ్యంలో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయంలో మంత్రులు బూతులతోనే అయిదేళ్లు పాలించారని అన్నారు. రాబోయే నాలుగేళ్లలో గ్రామాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించడానికి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. తణుకు నియోజకవర్గంలోని 234 బూత్‌ల పరిధిలో ప్రతి ఇంటికీ టిడిపి శ్రేణులు వెళ్లి వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడంతోపాటు అర్హత కలిగి సంక్షేమం అందని వారిని గుర్తించి వారికి సంక్షేమం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే 15 ఏళ్లపాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.